Andhra Pradesh: చంద్రబాబును తక్కువ అంచనా వేయొద్దు.. పవన్ పై ఆయన కామెంట్లు మైండ్ గేమ్ లో భాగమే!: ఉండవల్లి
- ఏపీలో కాంగ్రెస్ తో కలిస్తే టీడీపీకి నష్టమే
- జగన్ పాదయాత్రకు అపూర్వ స్పందన వస్తోంది
- చంద్రబాబు ఓ పోరాటయోధుడని వ్యాఖ్య
తెలంగాణలో మహాకూటమి(ప్రజాకూటమి) పేరుతో టీడీపీ-కాంగ్రెస్ కూటమి చేతులు కాల్చుకున్న సంగతి తెలిసిందే. దీంతో తాజాగా ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ తో కలిసి ఎన్నికలకు వెళ్లే అంశంపై టీడీపీలో భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్-టీడీపీ పొత్తుపై పార్లమెంటు మాజీ సభ్యుడు ఉండవల్లి అరుణ్ కుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఏపీలో కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకుంటే టీడీపీ నష్టపోతుందని ఉండవల్లి స్పష్టం చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ ఒంటరిగా పోటీ చేసుంటే కనీసం 50 స్థానాలు దక్కేవని వ్యాఖ్యానించారు.
కానీ తెలంగాణలో కాంగ్రెస్-టీడీపీ పొత్తు వికటించిందని అభిప్రాయపడ్డారు. కేంద్రం ఇచ్చిన నిధులను ఎవరూ డైరెక్టుగా జేబులోకి వేసుకోలేరనీ, దుర్వినియోగం చేసే అవకాశం మాత్రం ఉంటుందని తెలిపారు. జగన్ పాదయాత్రకు అనూహ్య స్పందన వస్తోందనీ, వైసీపీ శ్రేణులు దీన్ని క్యాష్ చేసుకోవాలని సూచించారు. తెలంగాణలో ఓటమి పాలైనా చంద్రబాబును తక్కువ అంచనా వేయడానికి లేదని ఉండవల్లి హెచ్చరించారు. చంద్రబాబు ఓ పోరాట యోధుడనీ, ఇటీవల పవన్ కల్యాణ్ పై ఆయన చేసిన వ్యాఖ్యలు మైండ్ గేమ్ లో భాగమని వ్యాఖ్యానించారు.