Telangana: పంచాయతీ ఎన్నికల కోడ్ ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవు: తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నాగిరెడ్డి
- ఎన్నికల జనరల్ పరిశీలకులకు అవగాహన
- ఇంత వరకూ కోడ్ ఉల్లంఘన కేసు నమోదు కాలేదు
- రిగ్గింగ్ జరిగితే రీపోలింగ్ నిర్వహించాలని ఆదేశం
తెలంగాణలో పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ జనవరి 1న విడుదలైంది. ఆ రోజు నుంచి ఎన్నికల నియమావళి అమల్లోకి వచ్చిన విషయం తెలిసిందే. ఈ ఎన్నికల కోడ్ ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నాగిరెడ్డి మరోమారు ఆదేశాలు జారీ చేశారు. హైదరాబాద్ లోని ఓ హోటల్ లో ఎన్నికల జనరల్ పరిశీలకులు, వ్యయ పరిశీలకులకు అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా నాగిరెడ్డి మాట్లాడుతూ, ప్రస్తుతం అమలులో ఉన్న సంక్షేమపథకాలను యథావిధిగా కొనసాగించవచ్చని, పంచాయతీ ఓటర్లను ప్రభావితం చేసేలా కొత్త పథకాలను ప్రకటించొద్దని సూచించారు. రాష్ట్రంలో ఎన్నికల కోడ్ ఉల్లంఘనకు సంబంధించి ఎక్కడా కేసు నమోదు కాలేదని చెప్పారు. ఎక్కడైనా రిగ్గింగ్ జరిగితే కనుక రీపోలింగ్ నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని ఈ మేరకు సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. బలవంతంగా లేదా ఒత్తిడితో పంచాయతీలను ఏకగ్రీవం చేస్తే చర్యలు తప్పవని, పరిమితిని మించి ఖర్చు చేస్తే అభ్యర్థులను అనర్హులుగా ప్రకటిస్తామని హెచ్చరించారు.