ayodhya: ఆ రోజున అక్కడ ఇటుక ఉంచేందుకు నేనే స్వయంగా వెళ్తాను: ఫరూక్ అబ్దుల్లా
- శ్రీరాముడు యావత్ ప్రపంచానికి చెందినవాడు
- కేవలం, హిందువులకే పరిమితం కాదు
- అయోధ్య సమస్య చర్చల ద్వారానే పరిష్కారం కావాలి
నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు, జమ్మూకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఫరూక్ అబ్దుల్లా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అయోధ్య భూవివాదం కేసు ఈ నెల 10వ తేదీకి సుప్రీంకోర్టు వాయిదా వేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, శ్రీరాముడు యావత్ ప్రపంచానికి చెందినవాడని, కేవలం, హిందువులకే పరిమితం కాదని అన్నారు. అయోధ్య భూ వివాదం సమస్య చర్చల ద్వారానే పరిష్కారం కావాలని, ఈ అంశంపై సంబంధిత వ్యక్తులు కలిసి చర్చించి పరిష్కరించుకోవాలే తప్ప కోర్టులను ఎందుకు ఆశ్రయించాల్సి వచ్చిందని ప్రశ్నించారు. ఈ వివాదం పరిష్కారమైన రోజున అక్కడ ఇటుక ఉంచేందుకు తాను స్వయంగా వెళ్తానని చెప్పిన ఫరూక్ అబ్దుల్లా, సాధ్యమైనంత త్వరగా రామాలయం అంశంపై పరిష్కారం కనుగొనాలని సూచించారు.