Telugudesam: ఆంధ్రాలో బీజేపీని ప్రజలు మట్టిలో కలిపేసే రోజులు దగ్గర పడ్డాయి: నారా లోకేశ్ ఫైర్
- బీజేపీ నాయకులపై నిప్పులు చెరిగిన లోకేశ్
- మోదీ ఇంటి ముందు ధర్నా చేసే దమ్ము వారికి లేదు
- సీఎం చంద్రబాబును అడ్డుకునే యత్నం సిగ్గుచేటు
కాకినాడ జేఎన్టీయూలో ‘జన్మభూమి-మా ఊరు’ కార్యక్రమానికి వెళుతున్న సీఎం చంద్రబాబుని బీజేపీ కార్యకర్తలు, నేతలు అడ్డుకున్న విషయం తెలిసిందే. ఈ ఘటనపై ఏపీ మంత్రి నారా లోకేశ్ ఘాటుగా స్పందించారు. బీజేపీ నేతలపై ఆయన విరుచుకుపడ్డారు. ఈ మేరకు వరుస ట్వీట్లు చేశారు. బీజేపీ, భారతీయ జోకర్స్ పార్టీగా మారిందని దుయ్యబట్టారు. ఆంధ్రప్రదేశ్ కి నీరు, మట్టి ఇచ్చి చేతులు దులుపుకున్న మోదీ ఇంటి ముందు ధర్నా చేసే దమ్మూ, ధైర్యం లేని బీజేపీ నాయకులు ముఖ్యమంత్రిని అడ్డుకునే ప్రయత్నం చేయటం సిగ్గుచేటని, ఆంధ్రాలో బీజేపీని ప్రజలు మట్టిలో కలిపేసే రోజులు దగ్గర పడ్డాయని ఘాటు వ్యాఖ్యలు చేశారు.
ఈ సందర్భంగా ఉపాధిహామీ పథకం నిధులు గురించీ లోకేశ్ ప్రస్తావించారు. ఉత్తమ ప్రతిభ కనబర్చిన రాష్ట్రాలకు ఉపాధిహామీ పథకం ద్వారా అధిక నిధులు రావడం చట్టం ద్వారా వచ్చిన హక్కు అని అన్నారు. ఇందులో బీజేపీ భిక్ష ఏమీ లేదు, చంద్రన్న కష్టం తప్ప అని వ్యాఖ్యానించారు. ఆంధ్రప్రదేశ్ కి ఉపాధిహామీ లో ఎక్కువ నిధులు కేటాయించాం అని అర్థం లేని చర్చ చేస్తున్న రాష్ట్ర బీజేపీ నాయకులు, బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాలు ఈ పథకం నిర్వహణలో ఎందుకు వెనుకబడి ఉన్నాయో చెప్పగలరా? అని ప్రశ్నించారు.