Andhra Pradesh: సీఎం చంద్రబాబు ఇప్పుడు ‘డ్రామా నాయుడి’గా మారుతున్నారు!: జీవీఎల్

  • అప్పులు తీసుకురావడం తప్ప చేసిందేమీ లేదు
  • రెండు నెలల్లో హైకోర్టు భవనం కట్టలేకపోయారు
  • మీరు సొంతంగా చేపట్టిన 5 పథకాలు చెప్పండి

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రూ.1.50 లక్షల కోట్ల అప్పులను తీసుకురావడం తప్ప సాధించింది ఏమీ లేదని బీజేపీ అధికార ప్రతినిధి జీవీఎల్ నరసింహారావు విమర్శించారు. గతేడాది డిసెంబర్ 15 కల్లా హైకోర్టు భవనం పూర్తవుతుందని చెప్పిన చంద్రబాబు, ఇప్పుడు సడెన్ గా విభజన చేశారంటూ కొత్త పాట అందుకున్నారని దుయ్యబట్టారు. దీన్ని మతిమరుపు అనుకోవాలా? లేక రాజకీయ బలుపు అనుకోవాలా? అని ప్రశ్నించారు. మీడియా గొంతు ఉంది కదా అని ఎంతోకాలం తప్పించుకోలేరని స్పష్టం చేశారు. ఢిల్లీలో ఈరోజు నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.

టీడీపీ నేతలు అన్నాడీఎంకే పార్లమెంటు సభ్యుల్లాగా ‘మనం కూడా కొంచెం తమాషా చేద్దాం’ అనుకుని వెల్ లోకి వెళ్లి ఆందోళన చేసి సస్పెండ్ అయ్యారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతీ రాజకీయ నాయకుడు ప్రజల కోసం కూలీలాగానే పనిచేయాలనీ, నేతలంతా సేవకులేనని వ్యాఖ్యానించారు. ఏ పనిని, హోదాను తక్కువ చేసి మాట్లాడటం సరికాదని తెలిపారు.

మెలో డ్రామా చేస్తే రాజకీయాల్లో పేరు వస్తుందని చంద్రబాబు భావిస్తున్నారని జీవీఎల్ పేర్కొన్నారు. సినిమా రంగంలో రామానాయుడు ఎంతో గొప్పవారనీ, ఆయన చాలా మంచి సినిమాలను తెరకెక్కించారని.. అదే రీతిలో ఏపీ సీఎం చంద్రబాబు ఇప్పుడు డ్రామా నాయుడుగా మారుతున్నారని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. దమ్ముంటే చంద్రబాబు చేపట్టిన 5 ప్రముఖ పథకాలను చెప్పాలని సవాల్ విసిరారు. దేశంలోనే 9.5 లక్షల ఇళ్లను అంటే దాదాపు ఆరోవంతు ఇళ్లను కేంద్రం ఏపీకి కేటాయించిందని అన్నారు.

  • Loading...

More Telugu News