China: ఎర్ర దుస్తులు ధరించే మహిళలను హత్య చేసే సీరియల్ కిల్లర్‌కు మరణశిక్ష అమలు చేసిన చైనా!
- ఎరుపు రంగు దుస్తులు ధరిస్తే హత్యే
- వారి ఇంటికి వెళ్లి రేప్ చేసి దోపిడీ
- బాధితుల్లో 8 ఏళ్ల చిన్నారి
ఎరుపు రంగు దుస్తులు ధరించి కనిపించే మహిళలను హత్య చేసే సీరియల్ కిల్లర్‌కు చైనా మరణశిక్ష అమలు చేసింది. 1988-2002 మధ్య 10 మంది మహిళలను గావో చెంగ్యాంగ్ అనే వ్యక్తి హత్య చేశాడు. వీరిలో ఓ బాలిక కూడా ఉంది. ఓ చిన్న కేసులో అతడి అంకుల్ ఇచ్చిన డీఎన్ఏను పరీక్షిస్తుండగా అసలు విషయం బయటపడింది. మహిళల హత్యల వెనక గావో హస్తం ఉందని తేలడంతో పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు. తాజాగా, కోర్టు అతడిని దోషిగా తేల్చి మరణశిక్ష విధించడంతో ప్రభుత్వం శిక్షను అమలు చేసింది.
బెయినీలో పచారీ సరుకుల దుకాణం ఉన్న గావో చెంగ్యాంగ్‌కు ఇద్దరు సంతానం. ఎరుపు రంగు దుస్తులు ధరించి మహిళలు కనిపిస్తే వారిని వెంబడించేవాడు. వారిని అనుసరిస్తూ ఇంటికి వెళ్లి వారిని రేప్ చేసి, ఇంటిని దోచుకుని దారుణంగా చంపేసేవాడు. అంతేకాదు, వారి మర్మాయవాలను తెగ్గోసేవాడు. అతడి బారినపడి ప్రాణాలు కోల్పోయిన వారిలో ఎనిమిదేళ్ల బాలిక కూడా ఉంది.
మూడు దశాబ్దాల క్రితం జరిగిన ఈ హత్యలను ఛేదించడం పోలీసులకు పెను సవాలుగా మారింది. అయితే, ఓ చిన్నపాటి కేసు విషయంలో గావో బాబాయి పరీక్షల కోసం డీఎన్ఏ ఇవ్వడంతో గావో బండారం బయటపడింది. దాని ఆధారంగా జరిపిన దర్యాప్తులో విస్తుపోయే విషయాలు వెల్లడయ్యాయి. దీంతో గావోను అదుపులోకి తీసుకున్నారు. గతేడాది మార్చిలో బెయిన్ సిటీ ఇంటర్మీడియెట్ పీపుల్స్ కోర్టు గావోను దోషిగా నిర్ధారించి మరణశిక్షను విధించింది.
సాధారణంగా చైనాలో మరణశిక్షలను లెథల్ ఇంజక్షన్ ఇచ్చిగానీ, ఫైరింగ్ స్క్వేడ్ తో కాల్చి చంపి గానీ అమలు చేస్తారు. అయితే, ఇతని విషయంలో ఎలా అమలు చేసిందీ తెలియరాలేదు.