Madhya Pradesh: మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్, బీజేపీ మధ్య ‘వందేమాతరం’ వివాదం!
- ప్రతినెలా మొదటి పనిదినం గీతం ఆలపించాలని గత బీజేపీ ప్రభుత్వం తీర్మానం
- దాన్ని అమలు చేయని కాంగ్రెస్ కొత్త సర్కారు
- దీంతో ఇరువర్గాల మధ్య మాటల యుద్ధం
మధ్యప్రదేశ్‌లో అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీజేపీ మధ్య మాటల యుద్ధం మొదలయింది. తాము అధికారంలో ఉండగా ప్రవేశ పెట్టిన ‘వందేమాతరం’ గీతం ఆలపించక పోవడాన్ని బీజేపీ తప్పుపట్టడంతో ఇరువర్గాల మధ్య వివాదం రాజుకుంది. వివరాల్లోకి వెళితే...మధ్యప్రదేశ్‌లో సుదీర్ఘకాలం అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ప్రభుత్వం సచివాలయంలో ప్రతి నెల మొదటి పనిదినం రోజున ‘వందేమాతరం’ గీతం ఆలపించడాన్ని తప్పనిసరి చేస్తూ ఆదేశాలు జారీచేసింది.
ఇటీవల రాష్ట్రంలో అధికార పగ్గాలు చేపట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం జనవరి ఒకటిన దీన్ని పాటించ లేదు. దీనిపై మాజీ సీఎం శివరాజ్‌సింగ్ చౌహాన్ అభ్యంతరం వ్యక్తం చేశారు. అధికార కాంగ్రెస్ పార్టీ తీరుపై మండిపడ్డారు. ‘వందేమాతరం కేవలం జాతీయ గీతమే కాదు. అది దేశభక్తికి ప్రతీక. అది ప్రజల హృదయాల్లో నూతన ఉత్సాహాన్ని కలుగజేస్తుంది. ప్రభుత్వాలు వస్తాయి, పోతాయి. కానీ దేశం, దేశభక్తి కంటే ఏదీ ఎక్కువ కాదు. తక్షణం వందేమాతర గీతం ఆలపించే ఆనవాయితీని పునరుద్ధరించాలి’ అంటూ ట్వీట్ చేశారు.
తన విజ్ఞాపనపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించకుంటే ఈనెల 6వ తేదీన దేశ భక్తులతో కలిసి సచివాలయం ప్రాంగణంలో తాను దేశభక్తి గీతాన్ని ఆలపిస్తానని తెలిపారు. శివరాజ్ సింగ్ చౌహాన్ వ్యాఖ్యలపై మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి కమలనాథ్ కూడా తీవ్రంగానే స్పందించారు. వందేమాతర గీతం ఆలపించని వారికి దేశభక్తి ఉండదా? అని ప్రశ్నించారు.
మరోవైపు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి భూపేంద్రగుప్తా కూడా ఘాటుగానే సమాధానమిచ్చారు. వందేమాతర గీతంపై బీజేపీ ఎందుకు ఇంత రాద్ధాంతం చేస్తోందో అర్థం కావడం లేదన్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మహంతి మంగళవారం బాధ్యతలు చేపట్టారని, ఆ పనుల్లో బిజీగా ఉండడం వల్ల ఆలపించకపోయి ఉండవచ్చునని ప్రభుత్వ చర్యపై వివరణ ఇచ్చారు.