Chandrababu: మళ్లీ పవన్, చంద్రబాబు కలుస్తారా?... చంద్రబాబు వ్యాఖ్యలతో కొత్త రాజకీయ చర్చ!
- మొన్నటివరకూ జగన్, పవన్ లను విమర్శించిన చంద్రబాబు
- నిన్నటి సమావేశంలో జగన్, కేసీఆర్ లు లక్ష్యంగా వ్యాఖ్యలు
- పవన్ తో కలిస్తే జగన్ కు భయమెందుకని ప్రశ్నించిన చంద్రబాబు
భారతీయ జనతా పార్టీతో కలిసిపోయిన పవన్ కల్యాణ్, వైఎస్ జగన్ లు నిత్యమూ తన ప్రభుత్వాన్ని ఇబ్బంది పెడుతున్నారని, అభివృద్ధిని అడ్డుకుంటున్నారని చెబుతూ ఉండే చంద్రబాబు కాస్తంత మెత్తబడ్డట్టు కనిపిస్తోంది. తన పాత మిత్రుడు పవన్ కల్యాణ్ ను ఉద్దేశించి చంద్రబాబు చేసిన తాజా వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనం. నిన్న అమరావతిలో మీడియాతో మాట్లాడుతున్న వేళ, ఆయన ఓ ప్రశ్నకు సమాధానంగా కీలక వ్యాఖ్యలు చేశారు. "పవన్, మేము కలసి పోటీచేస్తే తప్పేమిటి?" అని అన్నారు. తాము కలిస్తే, వైఎస్ జగన్ కు భయమేంటని ప్రశ్నించారు. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు కొత్త రాజకీయ చర్చకు తెరదీశాయి.
ఉండవల్లిలోని గ్రీవెన్స్ హాల్ లో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రాన్ని విడుదల చేసిన వేళ, ఆయన మాట్లాడారు. తాజా పరిణామాలను పరిశీలిస్తే, జగన్, కేసీఆర్ లు మోదీతో కలిసిపోయారని భావించవచ్చని అన్నారు. నిన్న మాత్రం ఆయన పవన్ కల్యాణ్ పేరును ఎత్తకుండా, జగన్, కేసీఆర్ లు మోదీతో కలసి తనను విమర్శిస్తున్నారని చంద్రబాబు వ్యాఖ్యానించడం గమనార్హం.