Pakistan: పదో తరగతి పాస్ కాకుండానే విమానం నడుపుతున్న పాకిస్తాన్ పైలెట్లు.. అధికారుల షాక్!
- పాకిస్తాన్ ఇంటర్నేషనల్ ఎయిర్ లైన్స్ నిర్వాకం
- నకిలీ సర్టిఫికెట్లతో ఉద్యోగంలో చేరిన పైలెట్లు
- కొరడా ఝుళిపించిన పాక్ సుప్రీంకోర్టు
సాధారణంగా పదో తరగతి పాస్ కాని వ్యక్తులు ఏం చేస్తారు? మహా అయితే మెకానిక్ లుగా, చిన్నచిన్న పనులు చేసుకుంటూ బతికేస్తారు. ఇంకొందరు వేర్వేరు రంగాల్లో తమ టాలెంట్ తో ముందుకు దూసుకుపోతారు. కానీ ఏకంగా విమానాలను నడుపుతారని ఊహించగలమా? మన పక్కనే ఉన్న పాకిస్తాన్ లో మాత్రం పది పాస్ కాని వ్యక్తులు ఏకంగా విమానాలను నడిపేస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న పాక్ సుప్రీంకోర్టు జడ్జి ఒకరు షాక్ కు గురయ్యారు.
పాకిస్తాన్ ఇంటర్నేషనల్ ఎయిర్ లైన్స్(పీఐఏ) పాక్ నుంచి విదేశాలకు విమానాలను నడుపుతోంది. ఈ నేపథ్యంలో పీఐఏలో అనర్హులు నకిలీ సర్టిఫికెట్లతో ఉద్యోగాల్లో చేరారని సుప్రీంకోర్టులో ఓ పిటిషన్ దాఖలయింది. దీంతో ఈ వ్యవహారంపై విచారణ చేపట్టాలని పాక్ సుప్రీంకోర్టు ఆదేశించింది. దీంతో రంగంలోకి దిగిన పాక్ పౌర విమానయాన సంస్థ.. విచారణలో బయటపడ్డ వాస్తవాలను చూసి విస్తుపోయింది.
తనిఖీల్లో భాగంగా దాదాపు 50 మంది ఉద్యోగులు అసలు సర్టిఫికెట్లు సమర్పించేందుకు ముందుకు రాకపోగా, ఏడుగురు ఉద్యోగులు ఫేక్ సర్టిఫికెట్లు పెట్టినట్లు తేలింది. అంతేకాదు.. వీరిలో ఐదుగురు కనీసం మెట్రిక్యులేషన్(పదో తరగతి) కూడా పాస్ కాలేదని తెలిసి అధికారులతో పాటు పాక్ సుప్రీంకోర్టు జడ్జీ కూడా విస్తుపోయారు.
మొత్తం 4,321 మంది ఉద్యోగుల సర్టిఫికెట్లను ఈ సందర్భంగా పరిశీలించినట్లు పాక్ అధికారులు తెలిపారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అయితే విచారణకు నిందితులు చదువుకున్న సంస్థలు సహకరించడం లేదని వ్యాఖ్యానించారు.