Andhra Pradesh: ఉమ్మడి హైకోర్టు విభజనకు లైన్ క్లియర్.. ఏపీ లాయర్ల పిటిషన్ ను కొట్టేసిన సుప్రీంకోర్టు!
- హౌస్ మోషన్ పిటిషన్ వేసిన లాయర్లు
- విభజనకు మరికొంత సమయం కోసం విజ్ఞప్తి
- జనవరి 2న విచారణ చేపడతామన్న సుప్రీం
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఉమ్మడి హైకోర్టు విభజనకు మార్గం సుగమం అయింది. ఏపీ హైకోర్టు విభజనకు మరింత సమయం కోరుతూ ఏపీ న్యాయవాదుల సంఘం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే హైకోర్టు తరలింపును నిలుపుదల చేస్తూ అత్యవసరంగా ఆదేశాలు జారీచేయాలని హౌస్ మోషన్ పిటిషన్ ను కోర్టులో దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో దీనిపై అత్యవసర విచారణకు సీజేఐ జస్టిస్ రంజన్ గొగోయ్ నేతృత్వంలోని ధర్మాసనం నిరాకరించింది.
ఈ పిటిషన్ ను అత్యవసరంగా విచారించాల్సిన అవసరం లేదనీ, జనవరి 2న ఇతర పిటిషన్లతో పాటు మామూలుగానే విచారణ చేపడతామని స్పష్టం చేసింది. దీంతో ఏపీ న్యాయవాదులు, జడ్జీలు అమరావతికి వెళ్లడానికి సిద్ధపడాలి.
దీంతో రేపు ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ప్రవీణ్ కుమార్, తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా టీబీఎన్ రాధాకృష్ణన్ ప్రమాణస్వీకారం చేయనున్నారు. గవర్నర్ నరసింహన్ న్యాయమూర్తుల చేత ప్రమాణస్వీకారం చేయిస్తారు.