India: బాక్సింగ్ డే టెస్టును తొలిసారి గెలిచిన ఇండియా... మరెన్నో విశేషాలు కూడా!
- ఓ పర్యటనలో రెండు టెస్టులు గెలవడం ఇది రెండోసారి
- టెస్ట్ సిరీస్ ను ఓడిపోకుండా ఉండటం ఇది నాలుగోసారి
- చివరి టెస్టు జనవరి 3 నుంచి సిడ్నీలో
- ఓడిపోయినా ట్రోఫీ ఇండియా వద్దే
భారత క్రికెట్ జట్టు తొలిసారిగా బాక్సింగ్ డే టెస్టును గెలుచుకుంది. ఇప్పటివరకూ ఆస్ట్రేలియాలో 8 బాక్సింగ్ డే టెస్టులను భారత్ ఆడగా, ఐదు మ్యాచ్ లలో ఆసీస్ విజయం సాధించగా, రెండు డ్రాగా ముగిశాయి. మెల్ బోర్న్ లో ఈ ఉదయం ఇండియా తొలి బాక్సింగ్ డే టెస్ట్ ను తన ఖాతాలో వేసుకుంది.
ఇక ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా రెండు టెస్టు మ్యాచ్ లను టీమిండియా గెలవడం ఇది రెండోసారి. 1977-78లో భారత జట్టు పర్యటించిన వేళ 5 టెస్టుల సిరీస్ లో ఇండియా 2 టెస్టులను గెలుచుకుంది. ఆ సిరీస్ లో మిగతా మూడింటిలో విజయం సాధించింది ఆస్ట్రేలియా. ఆపై 2018 వరకూ టీమిండియా ఏ ఆసీస్ పర్యటనలోనూ రెండు టెస్టులను గెలవలేదు. ఇదే సమయంలో ఆసీస్ పర్యటనలో టెస్ట్ సిరీస్ ను ఓడిపోకుండా ఉండటం ఇది నాలుగోసారి. 1980-81, 1985-86, 2000-01 పర్యటనల్లో ఇండియా ఆడిన సిరీస్ లు డ్రా అయ్యాయి.
ప్రస్తుత సిరీస్ లో అడిలైడ్ లో జరిగిన మ్యాచ్ ని ఇండియా, పెర్త్ లో జరిగిన మ్యాచ్ ని ఆస్ట్రేలియా, మెల్ బోర్న్ లో జరిగిన మ్యాచ్ ని ఇండియా గెలుచుకోగా, నాలుగో మ్యాచ్ సిడ్నీ జనవరి 3 నుంచి ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. మెల్ బోర్న్ లో ఆడిన టెస్టుల విషయానికి వస్తే, ఇక్కడ మొత్తం 13 టెస్టు మ్యాచ్ లను ఆడిన భారత్ కేవలం మూడింట మాత్రమే గెలిచింది. 1977లో జరిగిన టెస్టులో 222 పరుగుల తేడాతో, ఆపై 1981లో 59 పరుగుల తేడాతో ఆసీస్ పై భారత్ గెలిచింది.
ఇక చివరి టెస్టులో ఆసీస్ పై ఓడిపోయినా, ఆస్ట్రేలియాలో భారత్ సిరీస్ ను గెలిచినట్టే లెక్క. బార్డర్ - గవాస్కర్ ట్రోఫీ ఇండియా వద్దే ఉండటంతో, ఈ సిరీస్ సమమైనా, ట్రోఫీ ఇండియా వద్దే ఉంటుంది.