Narendra Modi: ఉద్యోగం కోసం ఏకంగా మోదీ సంతకాన్నే ఫోర్జరీ చేసిన ఘనుడు!
- బీఎస్సీ పూర్తి చేసిన సంజయ్
- ప్రభుత్వోద్యోగమే లక్ష్యం
- స్నేహితుడి సలహాతో రాంగ్ రూట్
ఏకంగా ప్రధాని నరేంద్రమోదీ సంతకాన్నే ఫోర్జరీ చేసి ఉద్యోగం కోసం దరఖాస్తు చేసుకున్నాడో కిలాడి. అయితే, కథ అడ్డం తిరిగి.. కటకటాలపాలయ్యాడు. కర్ణాటకలోని బెలగావికి చెందిన సంజయ్ కుమార్(30) బీఎస్సీ పూర్తి చేసి.. ఉద్యోగం కోసం వేట మొదలుపెట్టాడు.
అయితే ప్రభుత్వోద్యోగం సాధించాలనే లక్ష్యంతో స్నేహితుడి సలహా మేరకు రాంగ్ రూట్‌ను ఎంచుకున్నాడు. ప్రధాని మోదీ సంతకాన్ని నెట్‌లో చూసి ఫోర్జరీ చేసి, తన పేరిట ఓ రికమండేషన్ లెటర్ సృష్టించాడు. బెంగళూరులోని కర్ణాటక హైకోర్టులో టైపిస్టు ఉద్యోగానికి దరఖాస్తు చేస్తూ, సదరు సిఫార్సు ఉత్తరాన్ని కూడా జోడించి పంపాడు.
అయితే, అనుమానం వచ్చిన అధికారులు వెంటనే ప్రధాని కార్యాలయాన్ని సంప్రదించారు. సంజయ్ పేరుతో తాము ఏ ఉత్తరం ఇవ్వలేదని పీఎంవో స్పష్టం చేసింది. దాంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ నెల 17న కేసు నమోదు చేసి, గురువారం విధాన సౌధ సమీపంలో పోలీసులు సంజయ్‌ను అరెస్ట్ చేశారు.