Andhra Pradesh: కాకినాడ పోర్టులో కుప్పకూలిన క్రేన్లు.. ఒకరి మృతి, పలువురికి గాయాలు
- కొత్త క్రేన్ పై విరిగిపడిపోయిన పాత క్రేన్
- ప్రాణాలు కోల్పోయిన ఓ వ్యక్తి
- సహాయక చర్యలు చేపట్టిన అధికారులు
ఆంధ్రప్రదేశ్ లోని తూర్పుగోదావరి జిల్లాలో ప్రమాదం చోటుచేసుకుంది. కాకినాడలోని డీప్ వాటర్ పోర్టులో సరుకులను దించడానికి వాడే ‘ఆఫ్ షోర్ క్రేన్’ కూలిపోయింది. ఈ ఘటనలో పోర్టులో పనిచేస్తున్న ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోగా, ఐదుగురు గాయపడ్డారు. ఇంకా మరికొందరు వాటి కింద ఉండొచ్చన్న అనుమానంతో అధికారులు సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు. కాగా, భారీ బరువులను సైతం అవలీలగా ఎత్తగల ఈ క్రేన్ ఒక్కసారిగా కూలిపోవడంతో పోర్టు ప్రాంతం దద్దరిల్లింది.
కాగా, ప్రమాదం అనంతరం క్షతగాత్రులను పోర్టు అధికారులు సమీపంలోని జీజీహెచ్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందజేస్తున్నారు. ఈ విషయమై పోర్టు అధికారులు మాట్లాడుతూ.. ఇక్కడి పాత క్రేన్ కు గత కొన్ని రోజులుగా మరమ్మతులు సాగుతున్నాయని తెలిపారు. ఈ క్రమంలో పాత క్రేన్ ఒక్కసారిగా విరిగిపోయి కొత్త క్రేన్ పై పడిపోయిందని వెల్లడించారు. దీంతో రెండు క్రేన్లు కుప్పకూలిపోయాయని పేర్కొన్నారు. వీటి కింద పలువురు చిక్కుకున్నట్లు అనుమానిస్తున్నామని అన్నారు. మరోవైపు ఈ ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.