bollaram: బొల్లారంలోని రాష్ట్రపతి నిలయానికి సందర్శకుల తాకిడి
- ప్రవేశం ఉచితం.. పెరుగుతున్న సందర్శకుల సంఖ్య
- వచ్చే నెల 6 వరకు సందర్శించవచ్చు
- సందర్శకులను ఆకట్టుకుంటున్న జలపాతాలు
శీతాకాల విడిదిలో భాగంగా హైదరాబాద్, బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో రామ్ నాథ్ కోవింద్ బస చేసి వెళ్లిన విషయం తెలిసిందే. దీంతో ఆనవాయతీ ప్రకారం ఈ నెల 26 నుంచి వచ్చే నెల 6వ తేదీ వరకు ప్రజలు రాష్ట్రపతి నిలయాన్ని సందర్శించవచ్చని సంబంధిత అధికారులు ప్రకటించారు. ఈ ప్రకటన నేపథ్యంలో రాష్ట్రపతి నిలయం సందర్శనకు ప్రజల తాకిడి పెరిగింది. దీని ప్రవేశం ఉచితం కావడంతో సందర్శించేందుకు వచ్చే వారి సంఖ్య అధికమైంది.
రాష్ట్రపతి నిలయం గురించి చెప్పాలంటే.. నిజాం కాలంలో ఈ భవనాన్ని నిర్మించారు. అత్యంత పురాతనం, అద్భుతమైన భవనమిది. మొత్తం 90 ఎకరాల్లో ఉన్న ఈ ప్రదేశంలో ఔషధ మొక్కలే కాకుండా పలు రకాల పూల మొక్కలు, వివిధ రకాల పండ్ల తోటలు ఉన్నాయి. మొత్తం 16 గదులు ఉన్న ఈ భవంతిలో దర్బార్ హాల్, డైనింగ్ హాల్ చాలా ప్రత్యేకం. వంటగది నుంచి డైనింగ్ టేబుల్ వరకు ఉన్న అండర్ గ్రౌండ్ టన్నెల్ ప్రత్యేక ఆకర్షణ అని చెప్పొచ్చు. ఈ ప్రదేశంలో ఉన్న జలపాతాలు, రాక్ గార్డెన్ సందర్శకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి.