TRS: టీఆర్ఎస్ లో చేరాలని ఓ ముఖ్యనేత నుంచి ఆఫర్ వచ్చింది.. మంత్రి పదవి ఇచ్చినా వెళ్లను!: అశ్వారావుపేట ఎమ్మెల్యే నాగేశ్వరరావు

  • అశ్వారావుపేట ప్రజలు నన్ను నమ్మారు
  • వారి నమ్మకాన్ని వమ్ము చేయబోను
  • కేసీఆర్ నిధులు ఇస్తారన్న నమ్మకం ఉంది

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ మరోసారి అధికారాన్ని నిలబెట్టుకున్న సంగతి తెలసిందే. ఈ ఎన్నికల్లో 88 మంది టీఆర్ఎస్ అభ్యర్థులు విజయం సాధించగా, ఇద్దరు ఇండిపెండెంట్లు ఆ పార్టీలో చేరారు. ఈ నేపథ్యంలో టీడీపీ సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య, అశ్వారావుపేట ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావులు కూడా టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకుంటారని వార్తలు వచ్చాయి. వీటిని అప్పట్లోనే ఖండించిన నాగేశ్వరరావు మరోసారి పార్టీ ఫిరాయింపు వార్తలపై క్లారిటీ ఇచ్చేశారు.

తనకు టీఆర్ఎస్ లోని ఓ ముఖ్యనేత నుంచి పార్టీలో చేరాలని ఆఫర్ వచ్చిందని నాగేశ్వరరావు ఈరోజు మీడియాకు తెలిపారు. అయితే టీడీపీని వీడే ఆలోచన తనకు లేదని స్పష్టం చేసినట్లు పేర్కొన్నారు. తనకు మంత్రి పదవి ఇస్తామని ఆఫర్ చేసినా టీడీపీని వీడబోనని తేల్చిచెప్పారు.

అశ్వారావుపేట ప్రజలు తనపై నమ్మకం ఉంచి గెలిపించారనీ, వారి నమ్మకాన్ని వమ్ముచేయబోనని వ్యాఖ్యానించారు. అధికార పార్టీలోకి చేరకపోతే నిధులు రావన్న వాదనలు సరికాదని నాగేశ్వరరావు అన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎలాంటి వివక్ష చూపకుండా నిధులు అందిస్తారన్న నమ్మకం తనకు ఉందని తెలిపారు.

TRS
Telangana
Telugudesam
mecha
nageswara rao
minister
  • Loading...

More Telugu News