NTR: అంతా బాగుంది కానీ.. ‘యన్.టి.ఆర్’ సినిమాలో బాలకృష్ణ ఎవరు?
- యన్.టి.ఆర్ సినిమాలో కనిపించని బాలకృష్ణ పాత్రధారి
- టాలీవుడ్లో చర్చనీయాంశం
- జూనియర్ ఆర్టిస్టులతో పూర్తిచేసినట్టు సమాచారం
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ఎన్టీరామారావు జీవిత కథ ఆధారంగా రూపొందిస్తున్న చిత్రం ‘యన్.టి.ఆర్’. ఇటీవల విడుదలైన ఈ చిత్రం ట్రైలర్ సంచలనాలు నమోదు చేసింది. అతి తక్కువ సమయంలో లక్షలాదిమంది దీనిని వీక్షించారు. అంతేకాదు, ఈ ట్రైలర్ అంచనాలను మరింత పెంచేసింది.
ఎన్టీఆర్ తనయుడు, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఈ సినిమాలో ఎన్టీఆర్‌గా నటిస్తుండగా, హరికృష్ణ పాత్రలో కల్యాణ్ రామ్, చంద్రబాబు నాయుడు పాత్రలో రానా తదితరులు నటిస్తున్నారు. ఇంతవరకు బాగానే ఉంది కానీ, మరి ఈ సినిమాలో బాలకృష్ణ పాత్రను ఎవరు పోషిస్తున్నారన్న చర్చ ఇప్పుడు టాలీవుడ్లో మొదలైంది. ఈ విషయంలో చిత్ర యూనిట్ కూడా ఇప్పటి వరకు ఎటువంటి ప్రకటన చేయలేదు. అంతేకాదు, ఇటీవల విడుదలైన ట్రైలర్లోనూ బాలకృష్ణ పాత్రధారి కనిపించలేదు.
యన్.టి.ఆర్ సినిమాలో ఎన్టీఆర్ కుటుంబ సభ్యులంతా కనిపిస్తుండగా, బాలకృష్ణ మాత్రం కనిపించడం లేదు. దీంతో, ఇంతకీ ఈ సినిమాలో బాలకృష్ణ పాత్ర ఉందా? లేదా? అన్నది చర్చనీయాంశమైంది. తండ్రితో కలిసి బాలకృష్ణ పలు పౌరాణిక చిత్రాల్లో నటించారు. కాగా, ఈ సినిమాలో బాలకృష్ణ పాత్రను జూనియర్ ఆర్టిస్టులతో పూర్తి చేసినట్టు తెలుస్తోంది. అయితే, మరికొందరి వాదన మాత్రం ఇంకోలా ఉంది. బాలకృష్ణ పాత్రను బాలకృష్ణే చేశారని, ఆయన ద్విపాత్రాభినయం చేశారని చెబుతున్నారు. బాలకృష్ణ పాత్రలో ఆయన తనయుడు మోక్షజ్ఞ నటించినట్టు వార్తలు వినిపిస్తున్నా ఆ వార్తలను యూనిట్ కొట్టిపడేసింది.