Rajasthan: రాజస్థాన్ హోటల్స్ డిమాండ్: 31 రాత్రికి రూమ్ కావాలంటే రూ. 11 లక్షలు కట్టాల్సిందే!
- రాజస్థాన్ లో చుక్కలను అంటుతున్న హోటల్ గదుల అద్దె
- గత సంవత్సరంతో పోలిస్తే 20 శాతం వరకూ అధికం
- టూరిస్టుల తాకిడి పెరగడమే కారణమట
కొత్త సంవత్సరానికి స్వాగతం పలికే వేళ, స్టార్ హోటళ్లలో గదుల అద్దెలు చూస్తే గుండె గుబేలుమంటోంది. ముఖ్యంగా సంపన్నులు బస చేసేందుకు ఆసక్తి చూపించే రాజస్థాన్ లో గత సంవత్సరంతో పోలిస్తే 7 నుంచి 20 శాతం మేరకు గదుల అద్దెలు పెరిగాయి. జోధ్ పూర్ లోని ప్రతిష్ఠాత్మక ఉమైద్ భవన్ లో డిసెంబర్ 31 రాత్రి కోసం గది అద్దె రూ. 11.03 లక్షలుగా ఉండగా, ఉదయ్ పూర్ లోని తాజ్ లేక్ ప్యాలెస్ లో రూ. 11 లక్షలుగా ఉంది. అంత రేటు పెట్టినా కూడా గది దొరకని పరిస్థితి. ఎందుకంటే ఇప్పటికే అన్ని రూమ్ లూ బుక్ అయిపోయాయి కాబట్టి.
ఇక జైపూర్ విషయానికి వస్తే, తాజ్ రామ్ బాగ్ ప్యాలెస్ 31 రాత్రికి రూ. 8.53 లక్షల టారిఫ్ చెబుతోంది. ఈ సంవత్సరం రాజస్థాన్ లో పర్యాటకం శరవేగంగా వృద్ధి చెందడం, హోటల్స్ ఆక్యుపెన్సీ రేషియో 90 శాతం ఉండటంతోనే న్యూ ఇయర్ వేడుకలకు మంచి డిమాండ్ వచ్చిందని ఆతిథ్య రంగ నిపుణులు అంచనా వేస్తున్నారు.