Sabarimala: అయ్యప్ప స్వాములకు హెచ్చరిక... రైళ్లలో కర్పూరం వెలిగిస్తే మూడేళ్ల జైలు!

  • శబరిమలకు ప్రత్యేక రైళ్లు
  • రైళ్లలో దీపం వెలిగించి పూజలు
  • వికటిస్తే ఘోర అగ్ని ప్రమాదాలే
  • కఠిన చర్యలుంటాయని రైల్వే శాఖ హెచ్చరిక

అయ్యప్ప స్వాములు రైలు ప్రయాణ సమయంలో పూజల పేరిట దీపం, హారతి కర్పూరం తదితరాలను వెలిగిస్తే, కఠిన చర్యలు తప్పవని దక్షిణ మధ్య రైల్వే ఓ ప్రకటనలో హెచ్చరించింది. రైళ్లలో నిప్పు వెలిగించి పట్టుబడితే రూ. 1000 వరకూ జరిమానా, మూడు సంవత్సరాల జైలుశిక్ష పడే అవకాశం ఉందని తెలిపింది.

శబరిమల అయ్యప్ప ఆలయానికి వెళ్లే స్వాముల కోసం వివిధ ప్రాంతాల నుంచి ప్రత్యేక రైళ్లను నడుపుతుండగా, అయ్యప్ప భక్తులు బోగీలలో పూజలు చేసి, హారతుల పేరిట కర్పూరం వెలిగిస్తున్నట్టు ఫిర్యాదులు అందాయి. ఇటీవల కోయంబత్తూరు మీదుగా వెళుతున్న స్పెషల్ రైలులో భక్తులు దీపం పెట్టడాన్ని గమనించిన రైల్వే సిబ్బంది వారిని మందలించి వదిలిపెట్టారు.

ఈ తరహా చర్యలు వికటిస్తే ఘోర అగ్ని ప్రమాదాలు జరుగుతాయని హెచ్చరిస్తున్న ఉన్నతాధికారులు, అగ్నిప్రమాదాలకు కారణమయ్యే వస్తువులను తరలించడం శిక్షార్హమని తెలిపారు. రైళ్లలో హారతులు వెలిగిస్తే శిక్షలు తప్పవంటూ ఓ ప్రకటన విడుదల చేశారు.

Sabarimala
Ayyappa
Train
Champour
Jail Term
  • Loading...

More Telugu News