100 coin: రూ.100 నాణెం విడుదల చేసిన ప్రధాని మోదీ
- వాజ్ పేయి స్మారకార్థం నాణెం విడుదల
- అన్ని వర్గాల ప్రేమాభిమానాలను పొందిన నేత అంటూ మోదీ కితాబు
- ప్రతిపక్షంలో ఉన్నా ప్రజల గొంతుక వినిపించారంటూ ప్రశంస
మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్ పేయి స్మారకార్థం భారత ప్రదాని నరేంద్ర మోదీ ఈరోజు రూ. 100 నాణేన్ని విడుదల చేశారు. వాజ్ పేయి జయంతి వేడుకలను పురస్కరించుకుని... ఒక రోజు ముందే నాణేన్ని విడుదల చేశారు. ఈ నాణేనికి ఒకవైపు వాజ్ పేయి చిత్రంతో పాటు... ఇంగ్లీషు, హిందీ భాషల్లో ఆయన పేరును ముద్రించారు. మరోవైపు మూడు సింహాల చిహ్నం, సత్యమేవ జయతే నినాదం, రూ. 100 అంకెతో పాటు మన దేశం పేరును హిందీ, ఇంగ్లీషు భాషల్లో ముద్రించారు. ఈ నాణెం బరురు 35 గ్రాములు.
నాణెం విడుదల కార్యక్రమం సందర్భంగా మోదీ మాట్లాడుతూ, సమాజంలోని అన్ని వర్గాల ప్రజల నుంచి ప్రేమాభిమానాలను అందుకున్న అరుదైన నాయకుడు వాజ్ పేయి అని అన్నారు. మనతో ఆయన లేరనే విషయాన్ని నమ్మేందుకు మనసు అంగీకరించడం లేదని చెప్పారు. ఎక్కువ కాలం ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ ప్రజల పక్షాన వాజ్ పేయి గళం వినిపించారని తెలిపారు. ఇప్పుడున్న నేతలు ఐదేళ్లు అధికారానికి దూరమైనా, ప్రశాంతంగా ఉండలేకపోతున్నారని విమర్శించారు. ఈ ఏడాది ఆగస్టు 16న వాజ్ పేయి కన్నుమూసిన సంగతి తెలిసిందే.