Cold: తెలంగాణలో వణికిస్తున్న చలితో కరెంట్ కు తగ్గిపోయిన డిమాండ్!
- వ్యవసాయానికి 24 గంటల కరెంట్
- అయినా విద్యుత్ కు తగ్గిన డిమాండ్
- డిస్కంలకు ఆర్థిక వెసులుబాటు
పెరిగిన చలి తీవ్రతతో తెలంగాణలో విద్యుత్ రోజువారీ డిమాండ్ భారీగా పడిపోయింది. గత సంవత్సరం డిసెంబర్ లో గరిష్ఠంగా 8,508 మెగావాట్ల విద్యుత్ డిమాండ్ నమోదు కాగా, ఈ సంవత్సరం అది 8,502 మెగావాట్లకు తగ్గింది. వ్యవసాయానికి 24 గంటలూ కరెంట్ ఇవ్వడం ప్రారంభించిన తరువాత, గతేడాది డిమాండ్ ను మించకపోవడం ఇదే తొలిసారి. పెరిగిన చలి, అడపాదడపా కురుస్తున్న వర్షాల కారణంగా, ఏసీల వాడకం దాదాపు నిలిచిపోగా, గృహ, వ్యవసాయ విద్యుత్ వినియోగం కూడా తగ్గింది. భూగర్భ జలాలు తగ్గడం వల్ల కూడా విద్యుత్ వినియోగం తగ్గిందని, దీని కారణంగా యాసంగి పంటల సాగు సంతృప్తికరంగా సాగడం లేదని అధికారులు అంచనా వేశారు.
విద్యుత్ కు డిమాండ్ తగ్గడంతో డిస్కంలకు ఆర్థికంగానూ వెసులుబాటు కలుగుతోందని తెలంగాణ ట్రాన్స్ కో సీఎండీ డి.ప్రభాకరరావు వ్యాఖ్యానించారు. ఛత్తీస్ గఢ్ లోని మార్వా ప్లాంట్ల నుంచి తెలంగాణకు రోజుకు 1000 మెగావాట్ల విద్యుత్ రావాల్సి వుండగా, బొగ్గు కొరత కారణంగా 500 మెగావాట్లలోపే వస్తున్నా, విద్యుత్ కు కొరతలేదని అన్నారు. కాగా, నిన్న ఆదిలాబాద్ లో 10 డిగ్రీల అత్యల్ప ఉష్ణోగ్రత నమోదైంది. హైదరాబాద్ ఉష్ణోగ్రత 4 డిగ్రీలు పెరిగి 19 డిగ్రీలకు చేరింది.