Ram gopal varma: అదే జరిగితే ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమా ఏపీలో విడుదలవడం అసాధ్యం: దర్శక నిర్మాత కేతిరెడ్డి
- ఆ సినిమాను అడ్డుకునే అధికారం చంద్రబాబుకు ఉంది
- గతంలో జయలలిత అలానే చేశారు
- ఎన్నికల కోడ్ వస్తే మాత్రం ఆయనేమీ చేయలేరు
రాంగోపాల్ వర్మ దర్శకత్వంలో రూపొందిస్తున్న ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమా ఆంధ్రప్రదేశ్‌లో విడుదల కావడం దాదాపు అసాధ్యమని దర్శక నిర్మాత కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి అన్నారు. ఓ టీవీ చర్చా కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. ఏపీలో చంద్రబాబును ఇరుకున పెట్టాలన్న బీజేపీ ప్రభుత్వ అండదండలతో ఈ సినిమా సెన్సార్ అయినా, లా అండ్ ఆర్డర్ ప్రకారం సినిమా విడుదలను అడ్డుకునే అధికారం చంద్రబాబు ప్రభుత్వానికి ఉందన్నారు.
గతంలో కమల హాసన్ ‘విశ్వరూపం’ సినిమాను అప్పటి తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత అడ్డుకున్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. రెండు మతాలను రెచ్చగొట్టేలా ఈ సినిమా ఉందంటూ సినిమాను విడుదల కానివ్వలేదని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి ఆ అధికారాలు ఉంటాయని పేర్కొన్నారు.
‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమాను విడుదల కాకుండా ఆపే అధికారం ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఉందన్న కేతిరెడ్డి, అప్పటికి ఎన్నికల కోడ్ అమల్లోకి వస్తే మాత్రం చంద్రబాబు ఏమీ చేయలేరని అన్నారు. అయితే, కోడ్ రాకముందు మాత్రం విడుదలయ్యే చాన్స్ లేదని చెప్పుకొచ్చారు. అదే, ఎన్నికల కోడ్ వస్తే మాత్రం బాలకృష్ణ సినిమా ‘యన్.టి.ఆర్’ విడుదలకు కష్టాలు ఎదురవుతాయన్నారు. రాంగోపాల్ వర్మ సినిమాలో అసలు వ్యక్తులను నేరుగా చూపించారు కాబట్టి వారు ఫిర్యాదు చేసే అవకాశం ఉందని కేతిరెడ్డి పేర్కొన్నారు.