Andhra Pradesh: కడపలో జరుగుతున్నది రియల్ ఎస్టేట్ వ్యాపారమే.. టీడీపీ ఎంపీ 5,000 ఎకరాలు కొన్నాడు!: ఆనం సంచలన ఆరోపణ
- ఏపీని టీడీపీ-బీజేపీ మోసం చేశాయి
- ఓటమి భయంతోనే ఈవీఎంలపై అభ్యంతరం
- చంద్రబాబును ఏపీ ప్రజలు నమ్మరు
తెలుగుదేశం, బీజేపీ పార్టీలు నాలుగేళ్లు కలసి ఏపీ ప్రజలను మోసం చేశాయని వైసీపీ సీనియర్ నేత ఆనం రామనారాయణ రెడ్డి విమర్శించారు. వైసీపీ నుంచి పార్టీ ఫిరాయించిన ఎంపీలతో కలసి ప్రస్తుతం టీడీపీకి 20 మంది లోక్ సభ సభ్యులు ఉన్నప్పటికీ ఏమీ చేయలేని చంద్రబాబు.. ఇప్పుడు 25 పార్లమెంటు స్థానాల్లో టీడీపీని గెలిపించాలని ప్రజలను కోరడం సిగ్గుచేటని వ్యాఖ్యానించారు. హైదరాబాద్ లోని పార్టీ ప్రధాన కార్యాలయంలో ఈరోజు నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.
ఇంకో 4 నెలల్లో అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ప్రజలను మభ్యపెట్టేందుకు టీడీపీ అధినేత యత్నిస్తున్నారని ఆనం మండిపడ్డారు. చంద్రబాబు ధర్మపోరాటంలో ధర్మం, న్యాయం లేవని ఎద్దేవా చేశారు. ‘కడప స్టీల్ ఫ్యాక్టరీని మేమే కట్టుకుంటాం’ అని చంద్రబాబు చెప్పడాన్ని ఆనం తప్పుపట్టారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేదనీ, ఫీజు రీయింబర్స్ మెంట్ కూడా ఇవ్వలేనని చంద్రబాబు గతంలో చెప్పిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు.
ఇలాంటి పరిస్థితుల్లో స్టీల్ ప్లాంట్ ను సొంతంగా ఎలా నిర్మిస్తారని ప్రశ్నించారు. కడప స్టీల్ ప్లాంట్ పేరుతో అక్కడ టీడీపీ పార్లమెంటు సభ్యుడు ఒకరు 5,000 ఎకరాలు కొనుగోలు చేశారని ఆనం ఆరోపించారు. వీటి ద్వారా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేందుకు చంద్రబాబు, ఆయన అనుచరులు సిద్ధం అయ్యారని విమర్శించారు. చంద్రబాబును ఇకపై ఏపీ ప్రజలు నమ్మబోరని స్పష్టం చేశారు. ఓటమి భయంతోనే ఈవీఎంలను చంద్రబాబు వ్యతిరేకిస్తున్నారని వ్యాఖ్యానించారు.