kcr: కేసీఆర్ నాకు గిఫ్ట్ ఇస్తారట.. తీసుకోవాలా, వద్దా తమ్ముళ్లూ?: చంద్రబాబు
- కేసీఆర్ ఎలాంటి గిఫ్ట్ ఇస్తారో చూడాలి
- ప్రజాస్వామ్యంలో ఎవరు ఎక్కడైనా రాజకీయం చేయవచ్చు
- మోదీ గుండెల్లో నిద్రపోయి రాష్ట్ర హక్కులను సాధించుకుంటాం
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై ఏపీ సీఎం చంద్రబాబు విమర్శలు గుప్పించారు. 'కేసీఆర్ నాకు గిఫ్ట్ ఇస్తారట... ఎవర్ని బెదిరిస్తున్నారు?' అని ఆయన ప్రశ్నించారు. కేసీఆర్ గిఫ్ట్ తీసుకోవాలా, వద్దా తమ్ముళ్లూ? అని అడిగారు. శ్రీకాకుళంలో జరిగిన ధర్మ పోరాట దీక్షలో ఆయన ప్రసంగిస్తూ, విద్వేష రాజకీయాలకు టీడీపీ దూరంగా ఉంటుందని అన్నారు. కేసీఆర్ ఇచ్చే రిటర్న్ గిఫ్ట్ ఏంటో చూడాలని వ్యాఖ్యానించారు. ప్రజాస్వామ్యంలో ఎవరు, ఎక్కడైనా రాజకీయాలు చేయవచ్చని అన్నారు.
ప్రధాని మోదీ గుండెల్లో నిద్రపోయి రాష్ట్ర హక్కులను సాధించుకుంటామని చంద్రబాబు తెలిపారు. వెంకన్న సాక్షిగా ఇచ్చిన హామీలను కూడా మోదీ విస్మరించారని మండిపడ్డారు. మోదీ కంటే ఐదేళ్ల ముందే తాను ముఖ్యమంత్రిని అయ్యానని చెప్పారు. ప్రస్తుత పరిస్థితుల్లో కేంద్రంపై పోరాటం తప్ప మరో మార్గం లేదని అన్నారు. న్యాయం చేయమని అడిగితే దాడులు చేస్తున్నారని... ప్రశ్నిస్తున్న ఎంపీలపై ఐటీ దాడులు చేస్తున్నారని విమర్శించారు. 11 రాష్ట్రాలకు ప్రత్యేక హోదా ఇస్తున్నారని, ఏపీకి ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు.