Andhra Pradesh: తెలుగు టెక్కీ 'అనూహ్య' హత్యాచారం కేసు.. దోషికి మరణశిక్ష విధించిన బాంబే హైకోర్టు!
- కీలక తీర్పు వెలువరించిన బాంబే హైకోర్టు
- 2015, జనవరి 5న హత్యకు గురైన అనూహ్య
- తీర్పుపై హర్షం వ్యక్తం చేసిన అనూహ్య కుటుంబం
తెలుగమ్మాయి, సాఫ్ట్ వేర్ ఇంజనీర్ అనూహ్య హత్యాచారం కేసులో బాంబే హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. అనూహ్యపై అత్యాచారం చేసి, హత్య చేసిన ఘటనలో నిందితుడు చంద్రబాన్ సనప్ కు మరణశిక్ష విధించింది. 2015, జనవరి 4వ తేదీన విశాఖపట్నం నుంచి లోకమాన్య తిలక్ ఎక్స్ప్రెస్లో బయలుదేరిన అనూహ్య 5వ తేదీన ముంబైలో దిగింది. అనూహ్యను చూసిన చంద్రబాన్ రూ.300 ఇస్తే ఇంటి వద్ద దింపుతానని ఆఫర్ ఇచ్చాడు.
దీంతో తొలుత తటపటాయించిన అనూహ్య, మరో వాహనం లేకపోవడంతో చివరికి అతని బైక్ ఎక్కింది. అయితే అనూహ్యను నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లిన చంద్రబాన్ అత్యాచారం చేశాడు. అనంతరం ఈ విషయం బయటకు పొక్కకుండా ఆమె గొంతు నులిమి కిరాతకంగా హత్యచేశాడు. ఈ కేసును తొలుత విచారించిన సెషన్స్ కోర్టు చంద్రబాన్ కు మరణశిక్ష విధిస్తూ తీర్పు ఇచ్చింది. దీంతో అతను హైకోర్టును ఆశ్రయించాడు.
ఈ కేసును విచారించిన ధర్మాసనం సెషన్స్ కోర్టు ఇచ్చిన తీర్పును సమర్థించింది. చంద్రబాన్ పాల్పడ్డ అనాగరిక చర్యకు మరణదండనే సరయినదని వ్యాఖ్యానించింది. కృష్ణా జిల్లాలోని మచిలీపట్నం అనూహ్య కుటుంబీకుల స్వస్థలం. కాగా, కోర్టు తీర్పుపై అనూహ్య తండ్రి హర్షం వ్యక్తం చేశారు. ఆలస్యమయినా తమ కుమార్తెకు న్యాయం జరిగిందని వ్యాఖ్యానించారు.