Jinnah House: ముంబైలోని జిన్నా హౌస్ మాదే.. భారత్‌కు హక్కులేదు: పాక్
- సుష్మా వ్యాఖ్యలపై పాక్ స్పందన
- జిన్నా హౌస్ తమదేనని వాదన
- భారత ప్రయత్నాలను అంగీకరించబోమన్న పాక్
దక్షిణ ముంబైలోని ఖరీదైన మలబార్ హిల్ ప్రాంతంలో ఉన్న జిన్నాహౌస్ తమదేనని, దానిపై భారత్‌కు ఎటువంటి హక్కులు లేవని పాకిస్థాన్ పేర్కొంది. భారత విదేశంగ మంత్రి సుష్మాస్వరాజ్ ఇటీవల మాట్లాడుతూ.. జిన్నాహౌస్‌ను మంత్రిత్వశాఖకు బదిలీ చేసే ప్రయత్నం ప్రారంభమైందని చెప్పారు. మంత్రి వ్యాఖ్యలపై పాకిస్థాన్ విదేశీ మంత్రిత్వ శాఖ కార్యాలయం స్పందించింది. జిన్నా హౌస్ తమదేనని, దానిని మరొకరు స్వాధీనం చేసుకోవడానికి అంగీకరించబోమని పేర్కొంది. జిన్నాహౌస్ పాకిస్థాన్‌దేనని గతంలో భారత్ స్వయంగా ఒప్పుకుందని, అందుకు సంబంధించిన రికార్డులు కూడా తమ వద్ద ఉన్నాయని పేర్కొంది.
యూరోపియన్ శైలిలో సముద్రం ఒడ్డును నిర్మించిన ఈ బంగ్లాలో పాకిస్థాన్ ఫౌండర్ మహ్మద్ అలీ జిన్నా నివసించేవారు. 1930 వరకు ఆయన అక్కడే నివసించారు. జిన్నా తమవాడని, కాబట్టి ఈ బంగ్లాను తమ పేరుపై బదిలీ చేయాలని గతకొన్నాళ్లుగా పాకిస్థాన్ డిమాండ్ చేస్తోంది. తాజాగా, కేంద్రమంత్రి సుష్మాస్వరాజ్ మాట్లాడుతూ.. జిన్నా హౌస్‌ను భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ పేరుపై బదిలీ చేసే ప్రయత్నాలు ప్రారంభమైనట్టు చెప్పారు. దీంతో స్పందించిన పాక్ ఈ వ్యాఖ్యలు చేసింది.