banks: రేపటి నుంచి వచ్చే ఆరు రోజుల్లో ఐదు రోజులు బ్యాంకులు మూత!
- రేపు ఏఐబీవోసీ ఉద్యోగుల సమ్మె
- ఆపై రెండు రోజులు సెలవులు
- 24 తరువాత క్రిస్మస్ సెలవు
- 26న మరో సమ్మె
ఒకవైపు సెలవులు, మరోవైపు ఉద్యోగుల సమ్మెల కారణంగా రేపటి నుంచి వచ్చే ఆరు రోజుల వ్యవధిలో బ్యాంకులు ఐదు రోజుల పాటు మూతబడనున్నాయి. ఇందులో నాలుగు రోజులు దేశవ్యాప్తంగా బ్యాంకులన్నీ మూతబడనుండటంతో బ్యాంకింగ్ సేవలకు అంతరాయం కలగక తప్పదు.
సుదీర్ఘకాలంగా పెండింగ్ లో ఉన్న తమ డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ ఆల్ ఇండియా బ్యాంక్ ఆఫీసర్స్ కాన్ఫెడరేషన్ (ఏఐబీవోసీ) డిసెంబరు 21న సమ్మెకు నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఆపై 22న నాలుగో శనివారం సందర్భంగా, ఆపై 23న ఆదివారం కారణంగా బ్యాంకులు పనిచేయవు. తరువాతి రోజైన సోమవారం నాడు బ్యాంకులు పని చేస్తాయి. మంగళవారం నాడు క్రిస్మస్ సందర్భంగా బ్యాంకులకు మళ్లీ సెలవు కాగా, 26న యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్ సమ్మెకు పిలుపునిచ్చింది.
దీంతో 24వ తేదీని మినహాయిస్తే, మిగతా ఐదు రోజులూ బ్యాంకు సేవలకు ఆటంకం తప్పేలా లేదు. డిసెంబరు 21న జరిగే సమ్మెను బ్యాంకు యూనియన్లలో ప్రధానమైన ఏఐబీవోసీ పిలుపునివ్వగా, ఇందులో సుమారు 3.2 లక్షల మంది ఉద్యోగులు పాల్గొంటున్నారు. దీంతో ఏటీఎంలు మినహా మరే సేవలూ అందే అవకాశాలు కనిపించడం లేదు. 26 నాటి సమ్మె ప్రభావం మాత్రం నామమాత్రంగానే ఉంటుందని బ్యాంకు సంఘాలు అంటున్నాయి.