KCR: ముందడుగు పడేనా?... కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ కు ఆదిలోనే ఆటంకాలు!
- దేశవ్యాప్తంగా పలు ప్రాంతీయ పార్టీల నేతలతో కేసీఆర్ చర్చలు
- కాంగ్రెస్ తోనే కొనసాగుతున్న డీఎంకే, జేడీ (యస్), తృణమూల్
- తాజాగా కాంగ్రెస్ తో జట్టుకట్టిన తెలుగుదేశం
- ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటుపై నీలినీడలు!
కేంద్రంలో కాంగ్రెస్, బీజేపీయేతర ప్రభుత్వం ఏర్పడాలన్న ఉద్దేశంతో ప్రాంతీయ పార్టీలను ఏకతాటి పైకి తేవాలన్న తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కే చంద్రశేఖరరావు ఆలోచనలు ఫలించే అవకాశాలు లేవంటున్నారు రాజకీయ పరిశీలకులు. ప్రాంతీయ పార్టీలన్నీ కలిస్తే, బీజేపీ, కాంగ్రెస్ లకు ప్రత్యామ్నాయ శక్తిగా మారవచ్చని ఆలోచించిన ఆయన, ఇప్పటికే కొన్ని రాష్ట్రాల్లో పర్యటించి కొన్ని పార్టీల నేతలతో చర్చించిన సంగతి తెలిసిందే. కేసీఆర్ తో మాట్లాడిన వేళ, ఆయనకు మద్దతు పలికిన పలువురు నేతలు, ఇప్పుడు ప్లేటు ఫిరాయించడంతో ఫెడరల్ ఫ్రంట్ విషయమై ముందడుగు పడుతుందా? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
ఇటీవల డీఎంకే అధినేత స్టాలిన్ మాట్లాడుతూ, కూటమి తరఫున ప్రధాని అభ్యర్థిగా రాహుల్ గాంధీని తాను ప్రతిపాదిస్తున్నానని వెల్లడించిన సంగతి తెలిసిందే. ఫెడరల్ ఫ్రంట్ ఆలోచన తన మదిలో వచ్చిన వేళ, కేసీఆర్ స్వయంగా చెన్నై వెళ్లి స్టాలిన్ తో తన ఆలోచనలను పంచుకున్నారు. అదే సమయంలో బెంగళూరు వెళ్లి జనతాదళ్ (సెక్యులర్) నేత దేవెగౌడ, సీఎం కుమారస్వామిలతోనూ మాట్లాడి వచ్చారు. ఇప్పుడు స్టాలిన్ కాంగ్రెస్ కు అనుకూలంగా మాట్లాడుతుండగా, దేవెగౌడ కూడా ప్రస్తుతానికి కాంగ్రెస్ తోనే సాగుతున్నారు.
ఇక కేసీఆర్, కోల్ కతా వెళ్లి మమతా బెనర్జీని కూడా కలిసిరాగా, ఆమె కూడా ప్రస్తుతం కాంగ్రెస్ అనుకూల గ్రూప్ లోనే కొనసాగుతున్నారు. ఇక తాజాగా కాంగ్రెస్ గ్రూప్ లోకి తెలుగుదేశం పార్టీ కూడా వచ్చి చేరింది. కాంగ్రెస్ నేతృత్వంలోని కూటమి రోజురోజుకూ బలపడుతుండగా, కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ ఇంకా అడుగులు కూడా వేయడం లేదు.
కాగా, జరుగుతున్న పరిణామాలను కేసీఆర్ నిశితంగా పరిశీలిస్తున్నారని టీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. కాంగ్రెస్ పార్టీతో ఏఏ పార్టీలు కలుస్తున్నాయన్న విషయాన్ని ఆయన ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నారని సమాచారం. తాము రైతుల, పేదల అనుకూల ప్రాంతీయ పార్టీల కూటమిగా సాగుతామని, కలసి వచ్చే అన్ని పార్టీలతోనూ చర్చిస్తానని, తమ పోరాటం కేంద్రంలో అధికారాన్ని దక్కించుకునేందుకు కాదని ఇటీవల కేసీఆర్ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.