Andhra Pradesh: జన్మభూమి ఎక్స్ ప్రెస్ ఇకపై లింగంపల్లి వరకూ.. పొడిగించిన అధికారులు!
- విశాఖ-లింగంపల్లి మధ్య ప్రయాణం
- 2019, ఏప్రిల్ నుంచి అమలుకు నిర్ణయం
- సికింద్రాబాద్ లో తగ్గనున్న రద్దీ
ప్రయాణికుల సౌకర్యార్థం దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. జన్మభూమి ఎక్స్ ప్రెస్ రైలును లింగంపల్లి వరకూ పొడిగించేందుకు రైల్వేశాఖ అంగీకరించింది. విశాఖపట్నం నుంచి సికింద్రాబాద్ మధ్యలో జన్మభూమి ఎక్స్ ప్రెస్ నడుస్తోంది. అయితే హైటెక్ సిటీ, చందానగర్ పరిసర ప్రాంతాల్లోని ప్రజలు ఈ రైలును ఎక్కాలంటే సికింద్రాబాద్ స్టేషన్ వరకూ వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో పలువురు ప్రయాణికుల నుంచి విజ్ఞప్తులు రావడంతో అధికారులు చర్యలు తీసుకున్నారు.
2019, ఏప్రిల్ 14 నుంచి ఈ రైలు లింగంపల్లి-విశాఖపట్నం మధ్య పరుగులు తీయనుంది. గౌతమి, కాకినాడ, విజయవాడ ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్ రైళ్లను అధికారులు ఇప్పటికే లింగంపల్లి వరకూ పొడిగించారు. తాజా పెంపుతో సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ లో ప్రయాణికుల రద్దీ తగ్గనుంది.
జన్మభూమి రాకపోకలు..
విశాఖపట్నం నుంచి లింగంపల్లికి(నెం.12805): విశాఖపట్నం నుంచి ఇప్పటి మాదిరిగానే ఏప్రిల్ 14న ఉదయం 6.15కి బయలుదేరి సాయంత్రం 6.45 గంటలకు సికింద్రాబాద్‌కు చేరుకుంటుంది. అక్కడి నుంచి సాయంత్రం 6.55 గంటలకు బయలుదేరి బేగంపేటకు 7.09కు, లింగంపల్లికి రాత్రి 7.40 గంటలకు చేరుకుంటుంది.
లింగంపల్లి నుంచి విశాఖపట్నంకు (నెం.12806): లింగంపల్లి నుంచి ఏప్రిల్ 15న ఉదయం 6.15 గంటలకు బయలుదేరి బేగంపేటకు 6.38 గంటలకు, సికింద్రాబాద్‌కు 7 గంటలకు చేరుకుంటుంది. అక్కడినుంచి 7.10 గంటలకు బయలుదేరి అదే రోజు రాత్రి 7.40 గంటలకు విశాఖపట్నం చేరుకుంటుంది.