Andhra Pradesh: అనంతపురంలో దోపిడీదొంగల బీభత్సం.. గర్భిణిని రైలు నుంచి తోసేసిన దుండగులు!

  • కొండవీడు ఎక్స్ ప్రెస్ లో ఘటన
  • ప్రజలను దోచుకున్న దొంగలు
  • కేసు నమోదు చేసిన పోలీసులు

రైలులో దూరిన దోపిడీ దొంగలు అమానుషంగా ప్రవర్తించారు. ఓ గర్భిణి వద్ద ఉన్న నగలు, నగదును దోచుకున్న దుండగులు, కదులుతున్న రైలు నుంచి ఆమెను నిర్దాక్షిణ్యంగా తోసేశారు. దీంతో తీవ్రంగా గాయపడ్డ బాధితురాలిని స్థానికులు గమనించి 108 వాహనానికి, పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఈ దారుణ ఘటన అనంతపురం జిల్లాలోని ధర్మవరం వద్ద చోటుచేసుకుంది.

గుంటూరు జిల్లా పిడుగురాళ్లకు చెందిన దివ్య బెంగళూరులో తన భర్త వద్దకు వెళ్లేందుకు నిన్న మచిలీపట్నం నుంచి బెంగళూరుకు వెళ్లే కొండవీడు ఎక్స్ ప్రెస్ ను ఎక్కారు. రైలులో దివ్య కింది బెర్తులో పడుకోగా, పక్కనే ఉన్న మరో బెర్తులో ఆమె అత్త పడుకున్నారు. అయితే రాత్రిపూట రైల్లోకి ఎక్కిన దోపిడీ దొంగలు మహిళలు, పురుషులను బెదిరించి నగలు, నగదు లాగేసుకున్నారు. పలువురిపై దాడికి పాల్పడ్డారు. ఈ క్రమంలో గర్భిణిగా ఉన్న దివ్య వద్ద నగలు, మొబైల్ ఫోన్, నగదును లాగేసుకున్న దుండగులు,  ఆమెను కదులుతున్న రైలు నుంచి తోసేశారు.

రైలు నుంచి పక్కన పట్టాలపై పడిపోవడంతో దివ్యకు తీవ్రగాయాలు అయ్యాయి. ఆమె ఆర్తనాదాలు విన్న స్థానికులు, పోలీసులకు, 108 వాహనానికి సమాచారం అందించారు. దీంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు బాధితురాలిని ఆసుపత్రికి తరలించారు. ఈ సందర్భంగా దివ్య వాంగ్మూలాన్ని నమోదు చేసుకున్న పోలీసులు, ఆమె కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. ఈ విషయమై పోలీస్ ఉన్నతాధికారి ఒకరు మాట్లాడుతూ.. దివ్య వాంగ్మూలం ఆధారంగా గుర్తుతెలియని వ్యక్తులపై కేసు నమోదు చేశామనీ, త్వరలోనే దోషులను పట్టుకుంటామని తెలిపారు.

Andhra Pradesh
Anantapur District
kondaveedu express
train
thief
Police
case
  • Loading...

More Telugu News