amit shah: అమిత్ షా రథయాత్రకు అడ్డుకట్ట.. కోర్టును ఆశ్రయించనున్న బీజేపీ
- మమతా బెనర్జీ తీరుపై హైకోర్టులో అప్పీల్ చేస్తాం
- రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పూర్తిగా విఫలమైంది
- ఎమర్జెన్సీ దిశగా సాగుతోంది
పశ్చిమ బెంగాల్ లో బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా నిర్వహించాలనుకున్న రథయాత్రకు ఆ రాష్ట్ర ప్రభుత్వం అనుమతి నిరాకరించిన సంగతి తెలిసిందే. దీనిపై హైకోర్టుకు వెళ్లనున్నామని పశ్చిమబెంగాల్ బీజేపీ అధ్యక్షుడు దిలీప్ ఘోష్ తెలిపారు. ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తీరుపై హైకోర్టు సింగిల్ బెంచ్ లో అప్పీల్ చేస్తామని ఆయన చెప్పారు. రథయాత్రకు అనుమతించాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒప్పించేందుకు ప్రయత్నించామని... టీఎంసీ నేతలతో కూడా చర్చించామని... అయినా వారు తమ విన్నపాన్ని పట్టించుకోలేదని అన్నారు.
రథయాత్ర వల్ల శాంతిభద్రతల సమస్య తలెత్తే అవకాశం ఉందని మమతా బెనర్జీ చెబుతున్నారని... అలాంటప్పుడు రాష్ట్రంలో పోలీసులు ఉండి ఏం ప్రయోజనమని దిలీప్ ఘోష్ ప్రశ్నించారు. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పూర్తిగా విఫలమయిందని చెప్పడానికి మమత వ్యాఖ్యలే నిదర్శనమని ఎద్దేవా చేశారు. ఈ పరిస్థితి ఆర్టికల్ 356 (రాష్ట్రపతి పాలన) దిశగా సాగుతోందని చెప్పారు.