Telangana: పదవి కావాలంటే తెల్లారేసరికి తెచ్చుకుంటా.. నా దగ్గర డబ్బులు మాత్రం లేవు!: జానారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు
- రాజకీయాల్లో గెలుపోటములు సహజం
- టీఆర్ఎస్ డబ్బులు వెదజల్లి గెలిచింది
- ఎన్నికల కోసం అప్పులు చేశాను
రాజకీయాలు అన్నాక గెలుపోటములు సహజమని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత కె.జానారెడ్డి వ్యాఖ్యానించారు. ఎన్నికల్లో ఓటమిపై కార్యకర్తలు ఎవరూ ఆందోళన చెందవద్దనీ, ఆపద వస్తే ఆదుకోవడానికి సిద్ధంగా ఉన్నామని ధైర్యం చెప్పారు. తెలంగాణ ప్రజలు ఈసారి కేసీఆర్ మాయలో పడిపోయి టీఆర్ఎస్ కు ఓట్లు వేశారని అభిప్రాయపడ్డారు. ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ నేతలు భారీగా నగదును ఖర్చు పెట్టారని ఆరోపించారు. నల్లగొండ జిల్లా నిడమనూరులో నిర్వహించిన కాంగ్రెస్ సమీక్షా సమావేశంలో జానా పాల్గొన్నారు.
ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపుకోసం కాంగ్రెస్ కార్యకర్తలు అద్భుతంగా పనిచేశారని జానారెడ్డి కితాబిచ్చారు. ప్రజలే తన ఆస్తిపాస్తులని, ఓట్లు కొనేందుకు తన వద్ద డబ్బులు లేవని అన్నారు. రాజకీయాల్లో విలువలు ముఖ్యమనీ, పదవుల కోసం దిగజారలేనని వ్యాఖ్యానించారు. కావాలని కోరుకుంటే తెల్లారేసరికి పదవి తెచ్చుకునే సత్తా తనకు ఉందని తెలిపారు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఖర్చుల కోసం కొందరి దగ్గర అప్పులు చేయాల్సి వచ్చిందని వ్యాఖ్యానించారు. కేసీఆర్ హయాంలో తెలంగాణ రూ.2.70 లక్షల కోట్ల అప్పుల ఊబిలోకి జారిపోయిందని విమర్శించారు. ప్రజామోదం మేరకు పాలన సాగించకుంటే టీఆర్ఎస్ కు ప్రజలే బుద్ధి చెబుతారని జానారెడ్డి పేర్కొన్నారు. కోటి ఎకరాలకు సాగునీరు ఇస్తామన్న టీఆర్ఎస్ ప్రభుత్వం ఇప్పటివరకూ ఒక్క ఎకరాకు కూడా నీరివ్వలేకపోయిందని విమర్శించారు. ఈసారి నాగార్జునసాగర్ నియోజకవర్గం నుంచి పోటీచేసిన జానారెడ్డి ఓటమి పాలైన సంగతి తెలిసిందే.