America: అమెరికాలో రోడ్డుపై డబ్బులు వెదజల్లుకుంటూ పోయిన ఆర్మీ ట్రక్కు.. ఏరుకునేందుకు పోటీపడిన వాహనదారులు!
- అమెరికాలోని న్యూజెర్సీలో ఘటన
- ఇప్పటి వరకు 2.16 లక్షల డాలర్లు స్వాధీనం
- 3 లక్షల డాలర్లు మిస్సింగ్
ఓ ఆర్మీ ట్రక్కు జాతీయ రహదారిపై డబ్బులు వెదజల్లుకుంటూ పోయింది. దాదాపు మూడున్నర కోట్ల రూపాయలు (510,000 డాలర్లు) రోడ్డు పొడవునా పడిపోవడంతో ఏరుకునేందుకు వాహనదారులు, పాదచారులు క్యూ కట్టారు. డబ్బులు ఏరుకునే వారితో రోడ్డు రద్దీగా మారింది. వాహన డ్రైవర్లు డబ్బులను చూసి ఒక్కసారిగా బ్రేకులు వేడయంతో పలు ప్రాంతాల్లో చిన్నచిన్న ప్రమాదాలు జరిగాయి.
అమెరికాలోని న్యూజెర్సీలో జరిగిందీ ఘటన. రోడ్డుపై పడిపోయిన నోట్లను ఏరుకునేందుకు డ్రైవర్లు సడెన్ బ్రేకులు వేయడంతో పలు చోట్ల ప్రమాదాలు జరిగినట్టు పోలీసులు తెలిపారు. ట్రక్కులో రెండు బ్యాగుల్లో ఒకదాంట్లో 140,000 డాలర్లు, మరో దాంట్లో 370,000 డాలర్లు తరలిస్తుండగా ఈ ఘటన జరిగినట్టు పేర్కొన్నారు.
ఈ బ్యాగుల్లోని నోట్లు వెనక డోర్ నుంచి చెల్లాచెదురుగా పడ్డాయని, డ్రైవర్ గమనించకపోవడంతో దారిపొడవునా డబ్బులు పడినట్టు వివరించారు. ఇప్పటి వరకు 205,375 డాలర్లను బైకర్ల నుంచి స్వాధీనం చేసుకున్నామని, మరో ఐదుగురు వ్యక్తులు స్వచ్ఛందంగా 11,090 డాలర్లను వెనక్కి ఇచ్చినట్టు తెలిపారు. ఇంకా 3 లక్షల డాలర్లు దొరకాల్సి ఉందన్నారు.