Telangana: కొన్ని మీడియా సంస్థల ప్రచారాన్ని చూసి మా మీద మాకే డౌట్ వచ్చింది!: కేటీఆర్

  • ప్రజలు లేని ప్రజా కూటమిని తెలంగాణపై వదిలారు
  • ఆ మీడియా సంస్థలు విశ్వసనీయత కోల్పోయాయి
  • కాంగ్రెస్ నేతలు ఇంకా షాక్ నుంచి కోలుకోలేదు

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కొన్ని మీడియా సంస్థలు దారుణంగా ప్రవర్తించాయని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. ఒక అజెండాతో ప్రజలు లేని ప్రజాకూటమిని, తెలుగుదేశం అధినేత చంద్రబాబును తెలంగాణపై రుద్దడానికి చాలా బలంగా ప్రయత్నించాయని వ్యాఖ్యానించారు. తనకు మీడియా మిత్రులంటే అపార గౌరవం ఉందన్నారు.

‘మేము ప్రభుత్వాలను కూల్చగలం. నాయకులను తయారు చేయగలం. నాశనం చేయగలం. ప్రభుత్వాలను నిలబెట్టగలం’ అంటూ విర్రవీగే మీడియా సంస్థలకు ఇప్పటికే తెలంగాణ ప్రజలు చాలాసార్లు బుద్ధి చెప్పారని వ్యాఖ్యానించారు. ఇలాంటి వార్తలతో తమకు వచ్చిన నష్టం ఏమీ లేదనీ, ఆయా సంస్థలే తమ విశ్వసనీయతను కోల్పోయాయని వెల్లడించారు. హైదరాబాద్ లోని సోమాజిగూడలో ఈ రోజు నిర్వహించిన ‘మీట్ ది ప్రెస్’ కార్యక్రమంలో కేటీఆర్ మాట్లాడారు.

2006లో కరీంనగర్ ఉపఎన్నికల్లో కేసీఆర్ ను ఓడిచేందుకు ఇదే మీడియా సంస్థలు రకరకాల కుయుక్తులు పన్నాయని కేటీఆర్ ఆరోపించారు. తెలంగాణ ఉద్యమాన్ని అణచివేయడానికి, రాష్ట్రాన్ని అడ్డుకోవడానికి యత్నించిన కొన్ని శక్తులను తెలంగాణ ప్రజలు తిరస్కరించారని తెలిపారు. తాజాగా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా జరుగుతున్న ప్రచారాన్ని చూసి తమ మీద తమకే డౌట్ వచ్చిందని కేటీఆర్ అన్నారు. క్షేత్రస్థాయిలో వాస్తవ పరిస్థితి తమకు అనుకూలంగా ఉంటే.. కొన్ని మీడియా సంస్థలు మాత్రం మహాకూటమి విజయం సాధించేసింది, టీఆర్ఎస్ ఘోరంగా ఓడిపోబోతోంది అంటూ భారీ స్థాయిలో ప్రచారానికి దిగాయన్నారు.

ఈ ప్రచారంతో తాము కూడా ఆలోచనలో పడిపోయామని వ్యాఖ్యానించారు. అయితే ఈ ప్రచారాన్ని తెలంగాణ ప్రజలు అసలు నమ్మలేదన్నారు. అయితే దీన్ని బలంగా నమ్ముకున్న కాంగ్రెస్ నేతలు మాత్రం ఇంకా కోలుకోలేదని ఎద్దేవా చేశారు. ఇంకా ఓటమి నుంచి తేరుకోకుండానే ఈవీఎంల్లో గోల్ మాల్ జరిగింది, రిగ్గింగ్ చేశారు.. అంటూ కొత్త పాట పాడుతున్నారని దుయ్యబట్టారు. కాంగ్రెస్ పార్టీ నేతలు ఇంకా ఆత్మవిమర్శ చేసుకోకపోవడం సిగ్గుచేటని వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనకు మెచ్చిన తెలంగాణ ప్రజలు టీఆర్ఎస్ కు 88 సీట్లతో అఖండ విజయాన్ని అందించారని తెలిపారు.

  • Loading...

More Telugu News