TRS: నేడు టీఆర్ఎస్ లో చేరనున్న ఇండిపెండెంట్ ఎమ్మెల్యే రాములు నాయక్!
- ఇండిపెండెంట్ గా గెలుపొందిన రాములు నాయక్
- ఎన్నికైన వెంటనే టీఆర్ఎస్ కు మద్దతు ప్రకటన
- తెలంగాణ భవన్ లో నేడు కారెక్కనున్న నేత
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ పార్టీ అధికారాన్ని నిలబెట్టుకున్న సంగతి తెలిసిందే. ఇటీవల వెల్లడయిన ఫలితాల్లో మొత్తం 119 స్థానాలకు గానూ టీఆర్ఎస్ 88 సీట్లతో ఘనవిజయం సాధించగా, కాంగ్రెస్ 19, టీడీపీ 2, ఎంఐఎం ఏడుగురు, ఇద్దరు స్వతంత్రులు, ఓ బీజేపీ సభ్యుడు గెలుపొందారు. కాగా, ఎన్నికల ఫలితాల అనంతరం రామగుండం ఎమ్మెల్యే కోరుకుంటి చందర్, వైరా ఎమ్మెల్యే రాములు నాయక్ టీఆర్ఎస్ లో చేరుతున్నట్లు ప్రకటించారు. దీంతో అసెంబ్లీలో టీఆర్ఎస్ బలం ఏకంగా 90కు చేరుకుంది.
కాగా, ఇప్పటికే టీఆర్ఎస్ లో చేరుతున్నట్లు ప్రకటించిన రాములు నాయక్ కారు ఎక్కడానికి ఈరోజు ముహూర్తం ఖరారు చేసినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. తెలంగాణభవన్ లో టీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ సమక్షంలో ఈ రోజు సాయంత్రం 5 గంటలకు రాములు నాయక్ గులాబీ తీర్థం పుచ్చుకోనున్నారు. కాగా, రామగుండం ఎమ్మెల్యే కోరుకుంటి చందర్.. రాములు నాయక్ తో కలిసి టీఆర్ఎస్ లో చేరుతారా? లేదా? అన్నది ఇంకా స్పష్టత రాలేదు.