paruchuri: కథను రెండే నిమిషాల్లో చెప్పి ఒప్పించాలి: పరుచూరి గోపాలకృష్ణ
- కథ వినడానికి ఎక్కువ సమయం ఇవ్వరు
- తక్కువ సమయంలో చెప్పేలా ఉండాలి
- కథా వస్తువులోని కొత్త పాయింట్ చెప్పాలి
తాజాగా పరుచూరి గోపాలకృష్ణ తన 'పరుచూరి పాఠాలు' కార్యక్రమంలో 'కథను ఎలా చెప్పాలి' అనే అంశాన్ని గురించి చెప్పుకొచ్చారు. "ఏదైనా ఒక సినిమా కోసం కథను రాసుకుని వచ్చినప్పుడు, గంట .. గంటన్నర సేపు వినడానికి సమయాన్ని కేటాయించే అవకాశం అవతలి వారికి ఉండకపోవచ్చు. అందువలన ఎంతసేపటిలో కథను చెబుతావని అవతలివారు అడిగితే, రెండు మూడు నిమిషాల్లో చెప్పేస్తానని అనాలి.
'ఖైదీ రుద్రయ్య' విశ్రాంతి వరకూ గల కథను కృష్ణగారికి వినిపించడానికి రెండే నిమిషాల సమయం తీసుకున్నాను. అంతే .. సంతృప్తి చెందిన ఆయన సెకండాఫ్ చెప్పాల్సిన అవసరం లేదని అన్నారు. 'ప్రతిధ్వని' కథను కూడా రెండే నిమిషాల్లో రామానాయుడుగారి చెప్పాను. 'మనం ఈ సినిమా చేస్తున్నాం గోపాలకృష్ణ' అన్నారు. కథా వస్తువును .. అందులోని కొత్త పాయింట్ ను అవతలి వారికి రెండే నిమిషాల్లో చెప్పడం వలన ప్రయత్నాలు ఫలిస్తాయి" అని ఆయన తన అనుభవాలను చెప్పుకొచ్చారు.