passport: భార్యలను వదిలిపెట్టి వెళ్లిపోయిన 33 మంది ఎన్‌ఆర్ఐల పాస్‌పోర్టుల రద్దు

  • ఎన్ఆర్ఐ వివాహాలపై కేంద్రం దృష్టి
  • భార్యలను వదిలేసి పరారైన వారిపై ఉక్కుపాదం
  • నిబంధనలు కఠినతరం చేస్తున్న సర్కారు

భార్యలను వదిలిపెట్టి విదేశాలకు పారిపోయిన ఎన్ఆర్ఐలపై కేంద్రం ఉక్కుపాదం మోపుతోంది. ప్రతి ఏడాది ఈ కేసుల సంఖ్య పెరుగుతుండడంతో తీవ్రంగా పరిగణించిన కేంద్ర మహిళా శిశుసంక్షేమ మంత్రిత్వ శాఖ (డబ్ల్యూసీడీ) కొత్త ప్రతిపాదనలు సిద్ధం చేస్తోంది. ఇప్పటి వరకు ఈ కేసుల్లో  33 మంది ఎన్ఆర్ఐల పాస్‌పోర్టులు రద్దు చేసినట్టు డబ్ల్యూసీడీ తెలిపింది. వీరందరికీ ఇంటిగ్రేటెడ్ నోడల్ ఏజెన్సీ (ఐఎన్ఏ) లుక్ అవుట్ సర్క్యులర్లు జారీ చేసినట్టు పేర్కొంది. ఎన్ఆర్ఐ వివాహ కేసుల్లో ఇప్పటి వరకు 8 మందికి లుక్ అవుట్ సర్క్యులర్లు జారీ చేయగా 33 మంది పాస్‌పోర్టులను విదేశాంగ శాఖ రద్దు చేసినట్టు సీనియర్ అధికారి ఒకరు తెలిపారు.

ఎన్ఆర్ఐ వివాహాలను తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని, పెళ్లి చేసుకుని భార్యలను వదిలేసి పరారైన ఎన్ఆర్ఐల పాస్‌పోర్టులను రద్దు చేయడం వంటి నిబంధనలను పాస్‌పోర్టులో చేర్చడంతో పాటు మరికొన్ని ప్రతిపాదనలతో పూర్తి నివేదిక తయారుచేసినట్టు మహిళా శిశు సంక్షేమ శాఖ తెలిపింది. ఎన్ఆర్ఐ వివాహాల నుంచి మహిళలను రక్షించేందుకు అవసరమైన అన్ని చర్యలను తీసుకుంటున్నట్టు పేర్కొంది. ఫిర్యాదుల కోసం ప్రత్యేకంగా nricell-ncw@nic.in పేరుతో ఓ ఈమెయిల్ అడ్రస్‌ను అందుబాటులోకి తీసుకొచ్చినట్టు తెలిపింది. బాధితులు తమ ఫిర్యాదులను ఈ అడ్రస్‌కు మెయిల్ చేయాలని సూచించింది.

  • Loading...

More Telugu News