India: మహిళా సీఈవోకు చుక్కలు చూపించిన ఓలా డ్రైవర్.. కారును చీకటిలో నిలిపివేసి వేధింపులు!
- స్పందించని ఓలా సిబ్బంది
- మూడు రోజులైనా చర్యలు తీసుకోని ఓలా
- ట్విట్టర్ లో ఆవేదన వ్యక్తం చేసిన బాధితురాలు
సురక్షితంగా గమ్యస్థానానికి తీసుకెళ్లాల్సిన ఓలా డ్రైవర్ రాక్షసుడిగా మారాడు. క్యాబ్ బుక్ చేసిన మహిళా సీఈవోకు చుక్కలు చూపించాడు. దీంతో ఆందోళన చెందిన బాధితురాలు ఓలా కంపెనీకి ఫిర్యాదు చేయగా, తొలుత స్పందించిన అధికారులు, ఆ తర్వాత మాత్రం పట్టించుకోవడమే మానేశారు. కర్ణాటక రాజధాని బెంగళూరులో ఈ నెల 10న చోటుచేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
ముంబైలోని ఓ గార్మెంట్ కంపెనీలో సీఈవోగా పనిచేస్తున్న ఆకాంక్ష పూజారి ఈ నెల 10న బెంగళూరు కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి నగరానికి వెళ్లేందుకు ఓలా క్యాబ్ ను బుక్ చేశారు. అయితే క్యాబ్ లోకి ఎక్కాక రూట్ మ్యాప్ లో చూపించినట్లు కాకుండా మరో మార్గంలో డ్రైవర్ బయలుదేరాడు. దీంతో ఆమె వెంటనే అప్రమత్తమై.. రూట్ మ్యాప్ ప్రకారమే వెళ్లాలని సూచించారు. ఈ ఘటనతో అసహనానికి లోనయిన సదరు డ్రైవర్ వెంటనే ఆమె తన కారులోంచి దిగిపోవాలని గద్దించాడు. దీంతో బాధితురాలు ఓలా ఎమర్జెన్సీ నంబర్ కు కాల్ చేశారు.
తొలుత ఫోన్ కాల్ ను లిఫ్ట్ చేసిన ఓలా సిబ్బంది డ్రైవర్ తో మాట్లాడారు. దీంతో డ్రైవర్ ఆమెను చెప్పిన చోటుకు తీసుకెళ్లేందుకు అంగీకరించాడు. అయితే అతను ఫోన్ లో మాట్లాడుతూ కారును నడపసాగాడు. దీంతో ఫోన్ పక్కన పెట్టి నడపాలని బాధితురాలు మరోసారి కోరారు. ఈ ఘటనతో తీవ్ర ఆగ్రహానికి లోనయిన ఓలా డ్రైవర్ కారును ఓ చీకటి ప్రదేశంలో ఆపేశాడు.
దీంతో భయాందోళనలకు లోనయిన ఆమె ఓలాకు ఫోన్ చేయగా, ఎవ్వరూ కాల్ లిఫ్ట్ చేయలేదు. పోలీసులకు ఫోన్ చేసినా కాల్ కనెక్ట్ కాలేదు. దీనికి తోడు ఫోన్ లో బ్యాటరీ చార్జింగ్ కూడా తగ్గిపోయింది. చివరికి ఎలాగోలా ఇంటికి చేరుకున్న బాధితురాలు ఓలా వ్యవహారశైలిపై ట్విట్టర్ లో తీవ్ర విమర్శలు గుప్పించారు. తాను ఫిర్యాదు చేసి మూడు రోజులైనా బాధ్యులపై ఓలా కంపెనీ ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆకాంక్ష ఆవేదన వ్యక్తం చేశారు.