srikakulam: శ్రీకాకుళంలో 22న టీడీపీ చివరి ధర్మపోరాట దీక్ష సభ: మంత్రి అచ్చెన్నాయుడు

  • సభాస్థలిని త్వరలో నిర్ణయిస్తామని వెల్లడి
  • చివరి సభ కావడంతో ముగింపు అదరగొట్టాలని నిర్ణయం
  • తెలుగు రాష్ట్రాల నుంచి హాజరుకానున్న పార్టీ అతిరథులు

విభజన హామీలు నెరవేర్చకుండా, ప్రత్యేక హోదా ఇవ్వకుండా కక్ష సాధిస్తున్న కేంద్రం తీరుకు నిరసనగా అధికార టీడీపీ చేపడుతున్న ధర్మపోరాట దీక్ష కార్యక్రమం చివరి అంకానికి చేరింది. రాష్ట్ర వ్యాప్తంగా గత కొన్నాళ్లుగా నిర్వహిస్తున్న సభల్లో చివరిది ఈనెల 22న శ్రీకాకుళంలో నిర్వహిస్తున్నట్లు మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. ఆ తేదీని ముఖ్యమంత్రి అధికారికంగా ఖరారు చేశారని, సభ ఎక్కడ నిర్వహించేది త్వరలోనే తెలియజేస్తామని మంత్రి తెలిపారు. ఎంతో విజయవంతంగా కొనసాగిన దీక్షల్లో చివరిది కావడంతో ముగింపు మరింత విజయవంతంగా నిర్వహించాలని టీడీపీ అధిష్ఠానం భావిస్తోంది.

దీక్షకు రాష్ట్రం నలుమూలల నుంచి ఎంపీలు, ఎమ్మెల్యేలు, కీలక నేతలతోపాటు పార్టీ ప్రముఖులు, సాధారణ నేతలు భారీ సంఖ్యలో హాజరుకానున్నందున విశాలమైన స్థలం అవసరమని, ఇందుకోసం స్థలాన్వేషణ చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. మున్సిపల్‌ స్టేడియం చిన్నది కావడం, కోడి రామ్మూర్తి స్టేడియంలో పునర్నిర్మాణ పనులు జరుగుతుండడంతో అక్కడ సభ నిర్వహించడం కష్టం కాబట్టి ఎనభై అడుగుల రోడ్డును ఆనుకుని ఉన్న ఖాళీ స్థలం అయితే బాగుంటుందని భావిస్తున్నారు.

కాగా, సీఎం ధర్మపోరాట దీక్ష సభకు హాజరైన రోజునే పట్టణంలో ఏర్పాటు చేసిన పార్టీ నూతన కార్యాలయాన్ని కూడా ప్రారంభించాలని నిర్ణయించారు. 80 అడుగుల రోడ్డులో నిర్మించిన  కార్యాలయం నిర్మాణం పూర్తయి నెలలు గడుస్తున్నా ముహూర్తం కుదరక ఇన్నాళ్లు వాయిదా వేస్తూ వచ్చారు. ఇన్నాళ్లకు దానికి కూడా మోక్షం కలుగుతోంది.

  • Loading...

More Telugu News