Telangana: టీఆర్ఎస్ గెలిస్తే వైసీపీ, జనసేనలు సంబరాలు చేసుకోవడమేంటి?: ఏపీ మంత్రి ఆదినారాయణరెడ్డి ధ్వజం
- ఏపీలోనే ఎక్కువ అభివృద్ధి
- రుణమాఫీ మెరుగ్గా జరిగింది
- కేసుల మాఫీకే బీజేపీతో జత కట్టారు
తెలంగాణ ఎన్నికల్లో పోటీయే చేయని వైసీపీ, జనసేన పార్టీలు.. టీఆర్ఎస్ గెలిస్తే సంబరాలు చేసుకోవడమేంటని ఏపీ మంత్రి ఆదినారాయణ రెడ్డి ప్రశ్నించారు. నేడు ఆయన ఏపీ సచివాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్ర విభజన తరువాత తెలంగాణ కంటే ఏపీలోని అన్ని నియోజకవర్గాల్లో ఎక్కువ అభివృద్ధి జరిగిందని తెలిపారు. రుణమాఫీ, డ్వాక్రా రుణ మాఫీ ఏపీలోనే మెరుగ్గా జరిగిందని వెల్లడించారు.
కేసులను మాఫీ చేయించుకునేందుకే వైసీపీ.. బీజేపీతో కలిసిందని విమర్శించారు. గతంలో జగన్ మాట్లాడుతూ 2019లో తెలంగాణలో షర్మిల ఆధ్వర్యంలో తామే అధికారంలోకి వస్తామని చెప్పారని, అటువంటిది ఇప్పుడు అసలు పోటీయే చేయలేదని ధ్వజమెత్తారు. కేంద్రంపై ధర్మ పోరాటం చేస్తున్న సీఎం చంద్రబాబును, ప్రత్యేక హోదా ఇస్తామంటున్న కాంగ్రెస్‌ను విమర్శిస్తున్నారని ఆదినారాయణ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.