Telangana: వారసులను ఇంటికి పంపిన తెలంగాణ ఓటర్లు.. నలుగురికీ ఓటమే!

  • వారసులను కనికరించని తెలంగాణ ఓటర్లు
  • సుహాసిని, వీరేందర్ గౌడ్, విష్ణువర్థన్, అనిల్ కుమార్‌లు ఓటమి
  • ఓడినా గట్టి పోటీ ఇచ్చిన నేతలు

తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో చక్రం తిప్పాలన్న వారసుల ప్రయత్నం ఈసారి వికటించింది. తెలంగాణ రాజకీయాల్లో ప్రముఖ పాత్ర పోషించి ప్రజల మనసుల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్న నాయకుల వారసులను సైతం ఈ ఎన్నికల్లో తెలంగాణ ఓటర్లు తిరస్కరించారు. పోటీ చేసిన నలుగురు వారసులు పరాజయం పాలైనా, గట్టి పోటీ ఇవ్వడం గమనార్హం. అటువంటి వారిలో మాజీ మంత్రి పి. జనార్దన్ రెడ్డి తనయుడు విష్ణువర్థన్ రెడ్డి, మాజీ మంత్రి దేవేందర్ గౌడ్ కుమారుడు వీరేందర్ గౌడ్, నందమూరి హరికృష్ణ కుమార్తె సుహాసిని, మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ కుమారుడు అనిల్ కుమార్ యాదవ్ ఉన్నారు.

గత ఎన్నికల్లో ఓటమి పాలైన జనార్దన్ రెడ్డి తనయుడు విష్ణువర్థన్ రెడ్డి ఈసారి కూడా ఓటర్ల మనసును గెలవలేకపోయారు. తండ్రి జనార్దన్ రెడ్డి హఠాన్మరణంతో రాజకీయారంగేట్రం చేసిన విష్ణు 2008లో జరిగిన ఖైరతాబాద్ ఉప ఎన్నికల్లో గెలుపొందారు. 2009లో జరిగిన నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా ఏర్పడిన జూబ్లీ హిల్స్ నుంచి గెలుపొందారు. అయితే, గత ఎన్నికల్లో ఓటమి చవిచూసిన ఆయనకు ఈసారీ పరాజయం పలకరించింది.

టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి టి. దేవేందర్ గౌడ్ కుమారుడు వీరేందర్ గౌడ్‌ను ఓటర్లు మరోమారు తిరస్కరించారు. గత ఎన్నికల్లో చేవెళ్ల నుంచి పోటీ చేసి ఓటమి పాలైన ఆయన ఈసారి ఉప్పల్ నుంచి బరిలోకి దిగారు. అయినప్పటికీ ఓటర్లు ఆయనను కనికరించలేదు. అయితే, ప్రత్యర్థికి గట్టి పోటీ ఇచ్చి రెండో స్థానంతో సరిపెట్టుకున్నారు.

ఈసారి ఎన్నికల్లో ఏదైనా సంచలనం ఉందంటే అది కచ్చితంగా నందమూరి సుహాసినే. నందమూరి వారసురాలిగా అనూహ్యంగా తెరపైకి వచ్చిన ఆమె కూకట్‌పల్లి నుంచి బరిలోకి దిగి అందరి దృష్టిని ఆకర్షించారు. ఆమె గెలుపు నల్లేరుమీద నడకేనని భావించారు. అయితే, అనూహ్యంగా ఆమె ఓటమి పాలై రెండో స్థానంతో సరిపెట్టుకున్నారు.  

ఇక, యువజన కాంగ్రెస్ నేత, ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ కుమారుడు అయిన అనిల్ కుమార్ యాదవ్‌కు కూడా ఈ ఎన్నికలు నిరాశను మిగిల్చాయి. ఈ ఎన్నికల్లో ముషీరాబాద్ నుంచి పోటీ చేసిన ఆయన టీఆర్ఎస్ అభ్యర్థికి గట్టి పోటీ ఇచ్చారు. విచిత్రంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌ను వెనక్కి నెట్టి రెండో స్థానంలో నిలవడం గమనార్హం.

Telangana
Veerendar goud
N.Suhasini
Vishnu Vardhan Reddy
Anil kumar yadav
  • Loading...

More Telugu News