Telangana: తలసానికి జైకొట్టిన సనత్ నగర్ ప్రజలు.. వేములవాడను కాపాడుకున్న చెన్నమనేని రమేశ్!

- కూన వెంకటేశ్ గౌడ్ పై తలసాని గెలుపు
- పరిగి, చొప్పదండిలోనూ కారు జోరు
- పఠాన్ చెరులోనూ టీఆర్ఎస్ విజయం
తెలంగాణ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ జైత్రయాత్ర కొనసాగుతోంది. తాజాగా సనత్ నగర్ లో టీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ ఘనవిజయం సాధించారు. ప్రజాకూటమి అభ్యర్థి కూన వెంకటేశ్ గౌడ్ పై ఆయన 30,217 ఓట్ల మెజారిటీతో విజయదుందుభి మోగించారు. అలాగే వేములవాడలో టీఆర్ఎస్ అభ్యర్థి చెన్నమనేని రమేశ్ విజయం సాధించారు.
పరిగిలో టీఆర్ఎస్ అభ్యర్థి కొప్పుల మహేశ్ రెడ్డి తన సమీప ప్రత్యర్థిపై 18,150 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. చొప్పదండిలో టీఆర్ఎస్ అభ్యర్థి సుంకే రవిశంకర్ 42,249 ఓట్ల మెజారిటీతో ఘనవిజయం సాధించారు. మరోవైపు పఠాన్ చెరు నియోజకవర్గం నుంచి మహిపాల్ రెడ్డి 34,074 ఓట్ల మెజారిటీతో, దుబ్బాకలో సోలిపేట రామలింగారెడ్డి 62,421 ఓట్ల మెజారిటీతో ప్రభంజనం సృష్టించారు. తాజా అప్ డేట్ ప్రకారం మొత్తం 119 స్థానాలకు గానూ టీఆర్ఎస్ 86, ప్రజాకూటమి 23, బీజేపీ 2, మజ్లిస్ 6, ఇతరులు రెండు స్థానాల్లో లీడ్ లో కొనసాగుతున్నాయి.