Telangana: నేను జయలలితను చూశాను.. అదే అహంకారం ఇప్పుడు కేసీఆర్ లో కనిపిస్తోంది!: ఖుష్బూ
- తెలంగాణలో చాలా పాజిటివ్ నెస్ ఉంది
- కేసీఆర్ ప్రజలు, మంత్రులను కలవరు
- కేసీఆర్ ను బాగా స్టడీ చేశాను
తమిళనాడుతో పోల్చుకున్నప్పుడు తెలంగాణలో చాలా పాజిటివ్ నెస్ ఉందని సినీ నటి, కాంగ్రెస్ నేత ఖుష్బూ తెలిపారు. ఇక్కడ యువత, మహిళలు ఎన్నికల వేళ చాలా చురుగ్గా స్పందించారన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ను తాను బాగా స్టడీ చేశానని వెల్లడించారు. తమిళనాడు ముఖ్యమంత్రి దివంగత జయలలిత తరహాలోనే తెలంగాణ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు. ఓ తెలుగు ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఖుష్బూ మాట్లాడారు.
తాను తమిళనాడులో జయలలిత నియంతృత్వ పాలనను చూశాననీ, అదే అహంకారం టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ లోనూ కనిపిస్తోందని ఖుష్బూ మండిపడ్డారు. జయలలిత, కేసీఆర్ కు ప్రజలతో మాట్లాడటానికి సమయం ఉండదని ఆమె విమర్శించారు. సొంత పార్టీ ఎమ్మెల్యేలు, నేతలను కలవడానికి వీళ్లకు తీరిక ఉండదని ఎద్దేవా చేశారు. ఇలాంటి నేతలు ఇక ప్రజాసేవ ఏం చేస్తారని ప్రశ్నించారు. నాయకుడు అన్నాక ప్రజల్లోకి వెళ్లి పనిచేయాలనీ, ప్రజల సమస్యలను తెలుసుకుని పరిష్కరించాలని వ్యాఖ్యానించారు. కానీ కేసీఆర్ మాత్రం సచివాలయానికి పోను, నేతలను కలవను.. బయటకు రాను అంటూ మొండిపట్టుతో కూర్చున్నారని విమర్శించారు.