Telangana: తెలంగాణలో ఈవీఎంల ట్యాంపరింగ్ జరుగుతోంది.. ఇందుకు కేటీఆర్ మాటలే సాక్ష్యం!: వంటేరు ప్రతాప్ రెడ్డి
- టీఆర్ఎస్ తో ఈసీ కుమ్మక్కు అయింది
- వీవీ ప్యాట్ స్లిప్పులను కూడా లెక్కించండి
- ప్రజల అపోహలను తొలగించాలని డిమాండ్
తెలంగాణలో ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల(ఈవీఎం) ట్యాంపరింగ్ కు పాల్పడుతున్నారని గజ్వేల్ ప్రజాకూటమి అభ్యర్థి, కాంగ్రెస్ నేత వంటేరు ప్రతాప్ రెడ్డి ఆరోపించారు. గతంలో తమకు 100 సీట్లు వస్తాయని చెప్పిన టీఆర్ఎస్ నేత కేటీఆర్ ఇప్పుడు ఏకంగా 106 స్థానాల్లో గెలుస్తామని చెప్పడమే ఇందుకు నిదర్శనమని వ్యాఖ్యానించారు. ఈవీఎం యంత్రాల సామర్థ్యం, గోప్యతపై తమకు అనుమానం కలుగుతోందని తెలిపారు.
ఈ ఎన్నికల్లో గోల్ మాల్ చోటుచేసుకునే అవకాశముందని వంటేరు వ్యాఖ్యానించారు. ఈవీఎంల్లో నిక్షిప్తమైన ఓట్లతో పాటు వీవీ ప్యాట్ యంత్రాల్లోని ఓటర్ స్లిప్పులను కూడా లెక్కించాలని డిమాండ్ చేశారు. ఈ ఎన్నికల కోసం అధికార టీఆర్ఎస్ పార్టీతో రాష్ట్ర ఎన్నికల సంఘం కుమ్మక్కు అయిందని వంటేరు ప్రతాప్ రెడ్డి ఆరోపించారు. తమతో పాటు తెలంగాణ ప్రజలలో నెలకొన్న అపోహలను తొలగించాల్సిన బాధ్యత ఈసీ అధికారులపై ఉందని స్పష్టం చేశారు.