hindutva: జామా మసీదును కూడా కూల్చేస్తామన్న హిందుత్వవాదులు.. తీవ్రంగా స్పందించిన ఒవైసీ!
- రాజ్యాంగాన్ని కూల్చబోతున్నారని వ్యాఖ్య
- మోదీ హయాంలో ఇదే జరుగుతోందని ఎద్దేవా
- ఢిల్లీలో అయోధ్య ర్యాలీ సందర్భంగా ఘటన
అయోధ్యలో రామ మందిరాన్ని 2019లోనే నిర్మించాలని పలు హిందూ సంఘాలు నిన్న ఢిల్లీలో భారీ ర్యాలీని నిర్వహించిన సంగతి తెలిసిందే. కేంద్రంలో, ఉత్తరప్రదేశ్ లో బీజేపీ ప్రభుత్వాలే ఉన్నందున ఆలయ నిర్మాణాన్ని వెంటనే ప్రారంభించాలని పలువురు హిందూ నేతలు ప్రధాని మోదీని డిమాండ్ చేశారు. ఇచ్చిన మాటను మోదీ నిలబెట్టుకోవాలని సూచించారు. కాగా, ఈ కార్యక్రమం సందర్భంగా కొందరు హిందుత్వ నేతలు, కార్యకర్తలు వివాదాస్పద నినాదాలు చేశారు. అయోధ్యలో బాబ్రీ మసీదును కూలగొట్టిన తరహాలో ఢిల్లీలోని జామా మసీదును కూలగొడతామని నినాదాలు చేశారు.
దీంతో వీటికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ నేపథ్యంలో ఆల్ఇండియా మజ్లిస్ ఇత్తెహాదుల్ ముస్లిమీన్(ఏఐఎంఐఎం) అధినేత అసదుద్దీన్ ఈ రెచ్చగొట్టే వీడియోపై తీవ్రంగా స్పందించారు. ఈ హిందుత్వ మూకలు భారత రాజ్యాంగ వ్యవస్థను కూల్చాలని అనుకుంటున్నాయనీ, మసీదును కాదని వ్యాఖ్యానించారు. మోదీ ప్రభుత్వ హయాంలో యువత ఇంతలా ఆశావహంగా ముందుకు వెళుతోందని ఎద్దేవా చేశారు. ఈ మేరకు మజ్లిస్ అధినేత ట్విట్టర్ లో స్పందించారు. జామా మసీదును కూలగొట్టాలని నినాదాలు ఇస్తున్న వీడియోను ఒవైసీ తన ట్విట్టర్ హ్యాండిల్ లో షేర్ చేశారు.
Translation for those not fluent in Hindutva: Ek dhakka aur do, Bharatiya samvidhan ko todd do (Give it another push, destroy the Constitution of India). This is the voice of a young, aspirational India. pic.twitter.com/WktU0Z91il
— Asaduddin Owaisi (@asadowaisi) December 10, 2018