Andhra Pradesh: తూర్పుగోదావరిలో 1996లో ఓ గేదెను కాపాడినందుకు కలెక్టర్ ను చంద్రబాబు సస్పెండ్ చేశారు!: ఉండవల్లి
- ఐవైఆర్, అజయ్ వ్యాఖ్యలతో కళ్లు తిరుగుతున్నాయ్
- ప్రచారం కోసం చంద్రబాబు బస్సులో పడుకున్నారు
- సేవ్ ఆంధ్రప్రదేశ్ సదస్సులో మాట్లాడిన ఉండవల్లి
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఉన్నతస్థానాల్లో పనిచేసి పదవీ విరమణ చేసిన ఐఏఎస్ అధికారులు ఐవైఆర్ కృష్ణారావు, అజయ్ కల్లాం చెబుతున్న విషయాలు వింటుంటే కళ్లు తిరుగుతున్నాయని పార్లమెంటు మాజీ సభ్యుడు ఉండవల్లి అరుణ్ కుమార్ వ్యాఖ్యానించారు. ప్రభుత్వాలు ఈ రకంగా అవినీతికి పాల్పడతాయా! అని ఆశ్చర్యం కలుగుతుందని తెలిపారు. విశాఖపట్నం జిల్లాను హుద్ హుద్ తుపాను వణికించిన సందర్భంగా గెస్ట్ హౌస్ లో పడుకోవడానికి సీఎం చంద్రబాబు నిరాకరించిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు.
కేవలం ప్రచార ఆర్భాటం కోసమే బాబు ఆ పనిచేశారనీ, బస్సులో పడుకున్నారని దుయ్యబట్టారు. విశాఖపట్నంలో జనచైతన్య వేదిక ఆధ్వర్యంలో ఈరోజు నిర్వహించిన ‘సేవ్ ఆంధ్రప్రదేశ్’ సభలో ఉండవల్లి మాట్లాడారు. తాను కష్టపడుతున్నట్లు ప్రజల్లో ఒక భావన కలిగించడం ద్వారా రాజకీయంగా లబ్ధి పొందేందుకు చంద్రబాబు యత్నిస్తున్నారని ఉండవల్లి వ్యాఖ్యానించారు.
1996లో రెడ్డి సుబ్రహ్మణ్యం అనే ఐఏఎస్ అధికారి తూర్పుగోదావరి జిల్లాకు కలెక్టర్ గా పనిచేసేవారని తెలిపారు. అప్పట్లో తుపాను వస్తుందని రేడియోలో తెలుసుకున్న ఆయన సీఎం చంద్రబాబుకు చెప్పకుండానే ముందుగా జిల్లాలో పర్యటించారనీ, ఈ సందర్భంగా వరదలో కొట్టుకుపోతున్న ఓ గేదెను గ్రామస్తులతో కలిసి కాపాడారని వెల్లడించారు.
ఈ ఘటనకు సంబంధించిన ఫొటో మరుసటి రోజు పేపర్ లో రావడంతో ఆయన్ను సీఎం చంద్రబాబు వెంటనే సస్పెండ్ చేశారని పేర్కొన్నారు. తాను ఘటనాస్థలానికి వెళ్లకముందే సుబ్రహ్మణ్యం వెళ్లడంతో ముఖ్యమంత్రి కొరడా ఝుళిపించారని అన్నారు. అందుకే, పనిచేస్తే తలనొప్పి వస్తుందిరా అన్న భయం ఏపీ అధికారుల్లో నెలకొని ఉందన్నారు.