Cricket: నా జీవితంలో బెస్ట్ కెప్టెన్ అనిల్ కుంబ్లేనే.. అతని లాంటి నిస్వార్థపరుడిని నేను ఎప్పుడూ చూడలేదు!: గంభీర్
- నాయకుడికి, కెప్టెన్ కు తేడా ఉంటుంది
- జట్టుకోసం కుంబ్లే ఎంతకైనా తెగిస్తాడు
- ఆయన నుంచి ఎంతో నేర్చుకున్నా
తన జీవితంలో అనిల్ కుంబ్లే లాంటి కెప్టెన్ ను ఇప్పటివరకూ తాను చూడలేదని ఇటీవల రిటైర్మెంట్ ప్రకటించిన క్రికెటర్ గౌతమ్ గంభీర్ వ్యాఖ్యానించాడు. జట్టు కెప్టెన్ కావడానికి నాయకుడిగా ఉండటానికి తేడా ఉంటుందన్నాడు. ఇప్పటివరకూ తాను ఆడిన కెప్టెన్లలో దిగ్గజ స్పిన్నర్ అనిల్ కుంబ్లే గొప్ప నాయకుడని గంభీర్ కితాబిచ్చాడు. కుంబ్లే నిస్వార్థపరుడనీ, జట్టుకోసం ఎంతకైనా తెగిస్తాడని గంభీర్ తెలిపాడు. ఆయనతో కలిసి ఆడితే ఎంతో నేర్చుకోవచ్చన్నాడు.
తాను కుంబ్లే నాయకత్వంలో కేవలం ఐదు టెస్ట్ మ్యాచులు మాత్రమే ఆడానని గంభీర్ గుర్తుచేసుకున్నాడు. శ్రీలంక జట్టుతో టెస్ట్ సిరీస్ సందర్భంగా తాను భారత జట్టులోకి పునరాగమనం చేశాననీ, అప్పుడు ముత్తయ్య మురళీధరన్, అజంతా మెండిస్ వంటి మిస్టరీ స్పిన్నర్లను కుంబ్లే సూచనలు, సలహాల తోనే ఎదుర్కోగలిగానని వ్యాఖ్యానించారు. ఆ తర్వాత బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలోనూ కుంబ్లే నాయకత్వంలో భారత జట్టుకు ఆడినట్లు గంభీర్ వెల్లడించాడు.
తన కెరీర్‌లో కుంబ్లే లాంటి అత్యున్నత నాయకుడు, సొంత ఫామ్, ఆటతీరుపై పూర్తి నిజాయితీతో ఉన్న వ్యక్తి మరొకరు లేరని అభిప్రాయపడ్డారు. టీ20, వన్డే, టెస్ట్ ఫార్మట్ లకు గంభీర్ ఇటీవల రిటైర్మెంట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. గంభీర్ ఇప్పటివరకూ 58 టెస్టులు, 147 వన్డేలు, 37 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. 2007 టీ20 ప్రపంచకప్, 2011 వన్డే ప్రపంచకప్ ను భారత జట్టు అందుకోవడంలో కీలకంగా వ్యవహరించాడు.