India: మోదీ ప్రభుత్వం ముస్లింలపై వ్యతిరేకతతో ఉంది.. పాక్ ప్రధాని ఇమ్రాన్ విమర్శలు!
- పాకిస్తాన్ పట్ల తీవ్ర వ్యతిరేకత ప్రదర్శిస్తోంది
- 2019 తర్వాత పరిస్థితి మారుతుంది
- ముంబై దోషులపై చర్యలు తీసుకుంటున్నాం
బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం భారత్ లోని ముస్లింలతో పాటు పాకిస్తాన్ పై వ్యతిరేక భావనతో ఉందని పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఆరోపించారు. 2019 ఎన్నికల తర్వాత భారత్-పాకిస్తాన్ మధ్య ద్వైపాక్షిక సంబంధాలు మెరుగవుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇరుదేశాల మధ్య నిలిచిపోయిన శాంతి చర్చలు తిరిగి ప్రారంభమవుతాయని ధీమా వ్యక్తం చేశారు. పాక్ ప్రయోజనాల రీత్యా 2008 ముంబై ఉగ్రదాడుల సూత్రధారులు హఫీజ్ సయీద్, జకీవుర్ రెహ్మాన్ లఖ్వీ తదితరులపై చర్యలు తీసుకుంటున్నట్లు ఇమ్రాన్ ఖాన్ తెలిపారు.
భారత్-పాకిస్తాన్ మధ్య శాంతియుత పరిస్థితులు నెలకొనేందుకు తమ ప్రభుత్వం కృషి చేస్తుందని వ్యాఖ్యానించారు. కాగా, అమెరికా కోసం ఇకపై పాకిస్తాన్ పనిచేయబోదని ఇమ్రాన్ ఖాన్ స్పష్టం చేశారు. అమెరికా చెప్పినట్లు ఆడటానికి తాము ఇకపై వాళ్ల తోలుబొమ్మలం కాదని తేల్చిచెప్పారు. ఆఫ్గనిస్తాన్ లో ఉగ్రవాదులపై పోరులో సహకరించాలని అమెరికా చేసిన విజ్ఞప్తిపై ఆయన ఈ మేరకు స్పందించారు. పొదుపు చర్యలతో ఆర్థిక సంక్షోభం నుంచి పాకిస్తాన్ బయటపడుతుందని పేర్కొన్నారు.