Andhra Pradesh: ఏపీ ఎన్నికల్లో ఈసారి పోటీ చేస్తానో లేదో తెలియదు!: జేసీ దివాకర్ రెడ్డి నిర్వేదం
- అధికారంలో లేకపోయినా ప్రజాసేవ చేస్తా
- అనంతపురంలో రోడ్డు పనులు జనవరిలో చేపడతాం
- గతంలో జేసీని సుతిమెత్తగా హెచ్చరించిన చంద్రబాబు
రాబోయే ఎన్నికల్లో తాను పోటీ చేస్తానో, లేదో తెలియదని అనంతపురం పార్లమెంటు సభ్యుడు, టీడీపీ నేత జేసీ దివాకర్ రెడ్డి వ్యాఖ్యానించారు. 2019 ఎన్నికల్లో పోటీ చేయడంపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదన్నారు. అధికారంలో ఉన్నా, లేకపోయినా జిల్లా ప్రజలకు సేవ చేసుకుంటానని జేసీ పేర్కొన్నారు. అనంతపురంలో ఈ రోజు నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.
2019, జనవరి 19 తర్వాత అనంతపురం టౌన్ లో విస్తరణ పనులు ప్రారంభిస్తామని దివాకర్ రెడ్డి తెలిపారు. ఈ పనులను ఏ దుష్టశక్తులూ కూడా అడ్డుకోలేవని స్పష్టం చేశారు. జిల్లాలో వరి పంటను కాపాడుకోవడానికి హెచ్ఎల్సీ కాలువ ద్వారా 3 టీఎంసీల తుంగభద్ర నీటిని తీసుకొస్తున్నామని వెల్లడించారు. అనంతపురంలో గత నెల 22-23 తేదీల్లో చంద్రబాబు పర్యటించిన సంగతి తెలిసిందే.
ఈ సందర్భంగా టీడీపీ ఎమ్మెల్యేలు, పార్లమెంటు సభ్యుల పనితీరుపై నివేదికలు తెప్పించుకున్నారు. గుంతకల్, సింగనమల, కల్యాణదుర్గం, కదిరి, పుట్టపర్తి టీడీపీ ఎమ్మెల్యేల పనితీరుపై సీఎం ఈ సందర్భంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. పాలనను కుటుంబ సభ్యులకు అప్పగించి ప్రభుత్వానికి చెడ్డపేరు తీసుకువస్తున్నారని మండిపడ్డారు.
దీంతో అనంతపురం జిల్లాలో పార్టీ గెలవాలంటే సగం మంది సిట్టింగ్ నేతలకు టికెట్లు ఇవ్వొద్దని దివాకర్ రెడ్డి సీఎంకు సూచించారు. వెంటనే స్పందించిన ముఖ్యమంత్రి ‘ప్రజా వ్యతిరేకత ఎదుర్కొనే ఎవ్వరికీ టికెట్ ఇవ్వబోం. రేపు ప్రజా వ్యతిరేకత ఎదురైతే మీకు కూడా పార్టీ టికెట్ ఇవ్వను’ అని సుతిమెత్తగా హెచ్చరించారు. ఈ నేపథ్యంలో తాజాగా జేసీ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.