Yadadri Bhuvanagiri District: తెలంగాణలో ఎన్నికల వేళ పారుతున్న ‘ధన ప్రవాహం’.. ఆలేరులో రూ.13.3 లక్షలు స్వాధీనం
- చెక్‌పోస్టు వద్ద తనిఖీల్లో పట్టుబడిన నోట్ల కట్టలు
- టాటా ఏస్ వాహనంలో అట్టపెట్టె ద్వారా నగదు రవాణా
- నిందితుడిని విచారిస్తున్న పోలీసులు
ఎన్నికల వేళ తెలంగాణ రాష్ట్రంలో ధన ప్రవాహం కొనసాగుతోంది. పలుచోట్ల ఇప్పటికే పెద్ద మొత్తంలో నోట్ల కట్టలు స్వాధీనం చేసుకున్న పోలీసులకు గురువారం ఉదయం యాదాద్రి జిల్లా ఆలేరు చెక్ పోస్టు వద్ద మరో 13.3 లక్షల రూపాయలు తనిఖీల్లో దొరికింది. టాటా ఏస్ వాహనంలో కప్, సాసర్లు తరలించే అట్టపెట్టెల మధ్యలో ఓ పెట్టెలో ఈ నగదు ఉంచి తరలిస్తుండగా పట్టుకున్నారు.
చెక్ పోస్టు వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా ఈ మినీ రవాణా వాహనం వచ్చింది. పోలీసులు అందులోని అట్టపెట్టెలను నిశితంగా పరిశీలించారు. ఓ పెట్టెలో నగదును గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. వాహన డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్ నుంచి తొర్రూరుకు ఈ నగదును తరలిస్తున్నట్లు ప్రాథమిక విచారణలో తేలిందని ఎస్ఐ వెంకటరెడ్డి తెలిపారు.