kcr: నా కంఠంలో ప్రాణముండగా తెలంగాణను మళ్లీ బానిస కానివ్వను: సీఎం కేసీఆర్
- ఇప్పుడు కొట్లాడాల్సింది నేను కాదు ప్రజలు
- ఓటు హక్కుతో కొట్లాడాలి
- ప్రజల మద్దతు లేకుండా నేనొక్కడినేం చేయలేను
తన కంఠంలో ప్రాణముండగా తెలంగాణను మళ్లీ బానిస కానివ్వనని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. గజ్వేల్ లో నిర్వహించిన టీఆర్ఎస్ ఎన్నికల ప్రచార సభలో ఆయన మాట్లాడుతూ, ఇప్పుడు కొట్లాడాల్సింది తాను కాదని, ప్రజలని, ఓటు హక్కుతో కొట్లాడాలని పిలుపు నిచ్చారు.
చావు నోట్లోకి వెళ్లి తెలంగాణను సాధించి తెచ్చానని, డాక్టర్లు తాను కోమాలోకి వెళ్తానని చెప్పినా భయపడలేదని గుర్తుచేసుకున్నారు. కష్టపడి సాధించి తెచ్చుకున్న తెలంగాణను కాకులకు, గద్దలకు ఇస్తే చాలా ప్రమాదమని, ఈ విషయమై తెలంగాణ మేధావులు, ఉద్యోగులు, కవులు, కళాకారులు ఆలోచించాలని సూచించారు. తెలంగాణకు రక్షణ కవచంగా నిలవాల్సిన బాధ్యత మేధావులకుందని, ప్రజల మద్దతు లేకుండా తానొక్కడినేం చేయలేనని, మద్దతు ఉంటే ఏమైనా చేస్తానని అన్నారు.
నక్క జిత్తులకు, మాయమాటలకు మోసపోకుండా అప్రమత్తంగా ఉండాలని, 2018 ఎన్నికల చివరి ప్రచార సభ నుంచి యావత్తు తెలంగాణ ప్రజలకు తమ బిడ్డగా చెబుతున్నా, మనలో మనకు ఏవైనా చిన్న చిన్న విభేదాలు ఉంటే పరిష్కారం చేసుకుందాం తప్ప, వలస శక్తులకు చోటివ్వద్దని కోరారు. చంద్రబాబునాయుడి పెత్తనం నడిచే ప్రభుత్వం రావొద్దని, ఢిల్లీకి గులామ్ లం కావొద్దని సూచించారు.